Bapu-Ramana Music Hits

Sunday, June 5, 2011

నేడే చూడండి.. మీ అభిమాన ఆర్ట్ గ్యాలరీలో... బాపు బొమ్మల కొలువు


సోదరిసోదరీమణులారా...నేడే చూడండి...మీ అభిమాన ఆర్ట్ గ్యాలరీలో...బాపు బొమ్మలకొలువు...బాపు బొమ్మలకొలువు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ కలిసి ప్రారంభించిన అపురూప చిత్ర ప్రదర్శన "బాపు బొమ్మల కొలువు''. ప్రతిరోజు రెండు ఆటలు. ఉదయం 11గంటలకు మార్నింగ్‌షో, సాయంత్రం 5 గంటలకు ఫస్ట్‌షో. (సినిమా రిక్షాలో వినిపించే మైక్ అనౌన్స్‌మెంట్‌లా చదువుకో ప్రార్థన)

దర్శకుడు వంశీ కథలోని దేవాంగులమణి అద్దం ముందు కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతూ కొప్పు ముడేసుకుంటుంది. వెనక పసలపూడి ఊరంతా కనబడుతోంది. ఆ బొమ్మ ముందు నిల్చొని 'వంశీ' విభ్రమంగా ఫొటో తీయించుకుంటున్నారు. ఈ బొమ్మల కింద రేట్లు వేయలేదా అని అక్కినేని అంటున్నారు. సీమ సమరసింహారెడ్డి బొమ్మ ఏదైనా ఉందేమోనని బాలకృష్ణ వెతుకుతున్నాడు. మద్రాసు నుంచి కార్టూనిస్టు సురేంద్ర, నర్సింలు రెక్కలు కట్టుకుని వచ్చారు.

నాగార్జునసాగర్ నుంచి సుదర్శన్‌సారు మూటాముల్లె సర్దుకొని రాందేవ్ బాబా మీటింగ్‌కి వచ్చినట్టు వచ్చారు. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తే బొమ్మల కొలువు టైమ్‌కి అందుకోలేనని ఇంటికి వెళ్లకుండా రాత్రంతా జాగారం చేసి మరీ నేను హాజరయ్యాను. అందరూ వచ్చి ఇంత ఆబగా చూస్తున్నది ఏంటయ్యా అంటే బాపు బొమ్మలు. 1960, 70 ల్లో తెలుగు పత్రికల్లో నిండిపోయిన బాపు బొమ్మల ఒరిజినల్స్ ప్రదర్శన జరుగుతోంది మరి.

ఎగ్జిబిషన్‌కి వచ్చినవాళ్లు ఆ బొమ్మల్ని చూసుకుంటూ ఎవరి జ్ఞాపకాల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. ఈ బొమ్మ కథ నేను 70 ల్లో ఇంటర్‌లో ఉండగా చదివానని ఒకాయన, ఈ బొమ్మ నేను ఆంధ్రజ్యోతిలో 80 ల్లో చూశానని ఒకావిడ. ఆ కార్టున్ చూసి అప్పట్లో తెగ నవ్వారని ఇప్పుడూ నవ్వుతున్నానని ఓ ముసలాయనా..పిల్లలకు బొమ్మల్ని అపురూపంగా చూపిస్తున్న తల్లులు, తండ్రులు. ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ బాపు, ఆయన చుట్టూ ఆర్టిస్టుల మూక, క్లిక్‌మని ఫొటోలు, జూమ్‌మని వీడియోలు...సందడిసందడిగా ఉంది అక్కడి వాతావరణం.

తెలుగునాట ప్రసిద్ధ చిత్రకారులైన బాపుగారు అరశతాబ్దంగా వివిధ కథలకి, వేర్వేరు సందర్భాలకి వేసిన అపురూప చిత్రాలు చోటు చేసుకున్నాయి ఈ ప్రదర్శనలో. ఎన్నో కలర్ డ్రాయింగులు, బ్లాక్ అండ్ వైట్ ఇండియన్ ఇంక్ గీతలు సాధారణ డ్రాయింగ్ షీట్లమీద, ఖరీదైన టెక్చర్ పేపర్‌మీదా వేసినవి కనువిందు చేస్తున్నాయి. ఎక్కడ వెతికినా గీత తప్పురావడం, తుడవడానికి వైట్ కలర్ పూయడం కనిపించలేదు. బొమ్మల్లో అనాటమి అదిరిపోయి 'ఇలా ఎలా వేశాడ్రా బాపూ' అనుకోవడం ఆర్టిస్టుల వంతైంది. ముఖ్యంగా వంశీ కథలకి బాపు వేసిన బొమ్మలు అందరికీ ఆనందాన్ని పంచాయి.

ఇలాంటి దాదాపు వెయ్యి బొమ్మలదాకా ఈ బొమ్మలకొలువులో ఉంచారు ముఖీ మీడియావారు. కొన్ని ఒరిజినల్స్, కొన్ని ప్రింట్లు. మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ శని, ఆది, సోమవారాల్లో బాపు బొమ్మల ఎగ్జిబిషన్ జరుగుతోంది. తనికెళ్లభరణి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఆర్టిస్టులు మోహన్, ఏలెలక్ష్మణ్, పినిశెట్టి, అక్బర్‌లాంటి వాళ్లు వచ్చిపోతున్నారు. మీరందరూ కూడా వచ్చిపోవచ్చు. బొమ్మలు చూడొచ్చు. బుద్ధయితే ప్రింటన్లను కొనుక్కోవచ్చు. లేదంటే బాపు బొమ్మల సౌందర్యాన్ని చూసి ముక్కున వేలేసుకొని బయటికి ఫ్రీగా రావచ్చు. కమ్ మాన్. కమ్ విమెన్. కమ్ విత్ చ్రిల్డన్. * శేఖర్, కార్టూనిస్ట్

Sunday, April 10, 2011

బాపు రమణల రామాయణ 'సిత్రాలు'


 
రామచరితను వెండితెరకు ఎక్కించడంలో బాపు రమణలది మొదట్నించి ప్రత్యేక శైలి. బహుశా రామాయణాన్ని అన్ని కోణాల్లో వాడుకున్న దర్శక రచయితలు మరొకరు లేరేమో! సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం వారు నేరుగా తీసిన పౌరాణిక చిత్రాలు కాగా ... ముత్యాలముగ్గు, కలియుగ రావణాసురుడు, రాంబంటు, అందాల రాముడు, సుందరకాండలు ఆ గాథను పోలిన సాంఘిక చిత్రాలు. రామభక్తుడైన త్యాగరాజస్వామి కీర్తనలతో అలరించిన మరో చిత్రం 'త్యాగయ్య'. ఇంకా నిర్మాణంలో ఉన్న చిత్రం శ్రీరామరాజ్యం. బాపు రమణలు రామాయణాన్ని ఎంతో ఇష్టంగా, ఒక రమణీయ శ్రవ్య, దృశ్య కావ్యంగా మలచి ప్రేక్షకులకు అందించిన తీరుని అవలోకించే కథనమే స్టోరీ.

రామాయణాన్ని 'పాఠ్యే గేయేచ మధురమ్' అన్నారు. అంటే రామాయణం పాడుకోవడానికి, చదువుకోవడానికి కూడా అనుకూలమైనదన్నమాట. కాబట్టే రామతారక మంత్ర మహత్యాన్ని కృతులుగా గానం చేసిన త్యాగరాజస్వామి వంటి వాగ్గేయకారులున్నారు. నృత్యంలో, అభినయంలో రామాయణతత్వాన్ని ఆవిష్కరింపజేసిన మహానృత్య కళాకారులున్నారు. చిత్రకళ ద్వారా శ్రీరాముడి రూపాన్ని శ్రీ రామాయణ వైశిష్ట్యాన్ని కన్నులకు కట్టినట్టుగా చిత్రీకరించిన ప్రముఖ చిత్రకారులున్నారు. ఇలా ప్రతి కళలోనూ యుగయుగాలుగా రామనామం, రామతత్వం దర్శనమిస్తూ ఉంది. ఆధునిక యుగంలో సంగీత సాహిత్య నృత్య చిత్రకళలన్నీ కలిసిన సినిమా అనే సమాహార కళారూపంలో ఇది మనకు అద్భుతంగా రససిద్ధి కలిగిస్తుంది. దీని వలన ప్రజలకి ఏక కాలంలో శ్రోతలుగా, ప్రేక్షకులుగా రామతత్వాన్ని ఆస్వాదించే అవకాశం కలిగింది. ఈ మాధ్యమాన్ని బాపు రమణలు అద్భుతంగా ఉపయోగించుకుని రామాయణ తత్వాన్ని, రామ నామ వైశిష్ట్యాన్ని మనకి అందించారు.

ఒక వ్యక్తి అత్యుత్తముడిగా, ధర్మాత్ముడిగా జీవించాలంటే మానవుడిలా జీవించిన శ్రీరాముడిలా జీవించాలన్నది ఆర్యోక్తి. అలాగే రామాయణంలోని ప్రతి పాత్ర మనకి ఒక్కొక్క ధర్మాన్ని ఉపదేశిస్తుంది. వారందరూ తమ జీవితాల్లో తమ స్వధర్మాలని ఆచరించారు. కాబట్టే రామాయణంపై అన్ని కాలాల్లోను అంత ఆకర్షణ ఏర్పడింది. రామాయణ తత్వాన్ని బాపు రమణలు ఔపోసన పట్టారనడానికి వారి చిత్రాలే గొప్ప ప్రతీకలు. ప్రతి చిత్రంలో శ్రీరాముని గుణసంపద, రామాయణ ప్రతిపాదిత ధర్మం కనిపిస్తుంది.

బాపు రమణలు నేరుగా తీసిన రామాయణాలు మూడు- సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం. పరోక్షంగా రామాయణ తత్వాన్ని ప్రతిబింబించే సినిమాలు కూడా చాలా తీశారు వాళ్లు. త్యాగయ్య, ముత్యాల ముగ్గు, అందాల రాముడు, రాంబంటు మొదలైనవి. తెలుగు సినిమాల్లో రామాయణం ఇతివృత్తంగా అనేక సినిమాలు ఉన్నప్పటికీ, సంపూర్ణ రామాయణమే రామాయణ ప్రధాన కథాంశాన్నంతటినీ ప్రదర్శిస్తుంది. ఆ రోజుల్లో ఈ సినిమా తీయడం గొప్ప సాహసం కూడా. ఎన్.టి. రామారావు శ్రీరాముడిగా నటిస్తున్న రోజుల్లో మరొకరు రామ పాత్ర వేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆరుద్ర వంటి కమ్యూనిస్టులు రాముడి మీద పాటలు రాయడమేమిటని కొందరు ముందే విమర్శలతో సిద్ధమైపోయారు.

ప్రేక్షకుడికి వైకుంఠ స్పర్శ

బాపు చిత్రకారులు కావడంతో ప్రతి సన్నివేశంలో చూపించదలచుకున్న ప్రతి చిన్న అంశాన్నీ కూడా ఆయన ఒక బొమ్మ వేసుకుంటారు. ఆయన బొమ్మల సృష్టికి మూలం అంతా స్క్రీన్‌ప్లేలో చాలా పటిష్ఠంగా ముళ్లపూడి వెంకటరమణ అందించారు. వీరి సినిమాల్లో నేపథ్యమంతా చాలా కళాత్మకంగా, భావయుక్తంగా, సంగీతంతో కలిపి అలంకరింపబడి ఉంటుంది. సంపూర్ణ రామాయణం ప్రారంభంలోనే వైకుంఠాన్ని చేరుకోవడానికి సప్తలోకాలకి ప్రతీకలుగా సప్త ద్వారాలను చూపుతూ, "రఘువంశ సుధాంబుధి చంద్రమ'' అనే త్యాగరాజ కీర్తనని సుప్రసిద్ధ వైణికుడైన చిట్టిబాబు గారి వీణానాదం ద్వారా వినిపిస్తారు. విష్ణుతత్వాన్ని వివరించే "శాంతాకారం భుజగశయనం పద్మనాభం'' శ్లోకం విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికి పూర్తి అవుతుంది. ఆ విధంగా తొలి సన్నివేశానికే, ప్రేక్షకుడికి వైకుంఠ స్పర్శ కలుగుతుంది. 24 వేల శ్లోకాల రామాయణ మహాత్యం అంతా బాపుగారు చిత్రకళా రూపంలో ముందే ఆవిష్కరింపజేసి సిద్ధం చేసుకున్నారు. దీన్ని టైటిల్స్‌లోనే మనకు చూపుతారు.

రామాయణంలోని బాలకాండని సంపూర్ణ రామాయణంలో సంక్షిప్తంగాను, సీతా కళ్యాణంలో పరిపూర్ణంగాను బాపు రమణలు చిత్రీకరించారు. రామాయణంలో శ్రీరామ పాత్ర కావ్యమంతా కనిపిస్తే సీత పాత్ర అంతర్లీనంగా దృశ్యాదృశ్యంగా ఉంటుంది. బాపు రమణలు శ్రవ్య కావ్యాన్ని దృశ్య కావ్యంగా మలచడంలో సీతాకళ్యాణం సినిమాకి ఆ పేరు ద్వారా వాల్మీకి హృదయ భావన, రామాయణానికి మరో పేరు అయిన సీతాయాశ్చరితం అనే సత్యాన్ని స్ఫురింపజేశారు. దీనికి ఆవిష్కరణగా ఈ సినిమాలో సీతా మనోభావ రూపకంగా రామాయణం దర్శించబడటం ఒక విశేషం. సంపూర్ణ రామాయణంలో చంద్రకళ, శోభన్‌బాబులు నటిస్తే, సీతాకళ్యాణంలో రవి, జయప్రదలు నటించి పాత్ర స్వభావాలను అత్యంత ప్రతిభావంతంగా పోషించారు.

... అందుకోగలిగినవారికే పూర్తి రసానందం

రెండు రామాయణ సినిమాలూ రావణ దౌష్ట్యాల గురించి దేవతలు శ్రీ మహావిష్ణువుకి విన్నవించడంతోనే ప్రారంభమైనా, రెండిటి చిత్రీకరణలో బాపు విలక్షణత చూపారు. రవికాంత్ నగాయిచ్ ఫోటోగ్రఫీలో పురుష సూక్తంతో విశ్వమంతా వ్యాపించిన నారాయణతత్వాన్ని సూచిస్తూ చిత్రీకరించారు. వెలుగు ప్రక్కనే చీకటి ఉన్నట్లు తక్షణమే రావణ దౌష్ట్యాన్ని చూపి శ్రీరామ అవతార ఆవశ్యకత సూచిస్తారు. రావణాసురుడు ఎంత అసురుడైనా, అతడొక రావణబ్రహ్మ అనే విషయాన్ని శ్రీ మహావిష్ణువే స్వయంగా వివరిస్తారు. స్త్రీ కన్నీటి బిందువులే శ్రీరామ అవతారాన్ని ప్రభవింపజేశాయని చిత్రీకరిస్తారు. ఇందులో ప్రధానాంశమేమిటంటే సంభాషణలలో కన్నా సంగీతంలో చిత్రీకరణలో ఎక్కువ భావాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సీతాకళ్యాణం చూసేటప్పుడు మనమో విషయం గుర్తు పెట్టుకోవాలి. బాపు రమణలు దేన్నయినా చిత్రీకరించేటప్పుడు దానిని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ప్రతి అంశం వాచ్యంగా వినబడదు. కొంత సంభాషణల రూపంగా, కొంత నటుల హావభావాల్లోను, కొంత నేపథ్యంలోను, కొంత సంగీతంలోను కలిపి ఏక కాలంలో బాపు రమణలు అందిస్తారు. ప్రేక్షకులు సంభాషణల్లోని సాహిత్యాన్నే తలచుకుంటూ ఉండిపోయినా, సంగీతాన్నే ఆస్వాదిస్తూ ఉండిపోయినా, నటుల నటననే చూస్తూ ఉండిపోయినా, నేపథ్యం చిత్రీకరణ సొగసులకు కట్టుబడిపోయినా మిగిలినవన్నీ పూర్తిగా దర్శించలేకపోయే అవకాశముంది. అన్నిట్నీ అందుకోగలిగిన వారిదే పూర్తి రసానందం.

సినిమాల్లో చూపలేనివి టీవీలో చూపించారు


మహాశక్తివంతులైనా, ప్రకృతి శక్తులని వశం చేసుకోగలిగినా, భక్తాగ్రేసరులైనా, సమస్త శత్రువులను జయించిన వారైనా అహంకారమనే అంతరంగ శత్రువుని జయించలేకపోతే సర్వం వృధా, నాశనం తప్పదనే ఆధ్యాత్మిక సత్యాన్ని రెండు రామాయణాల్లోనూ శ్రీమహావిష్ణువు రావణాసురుడిని ఉద్దేశించి పలికిన వాక్యాలు. ఈ అహంకారానికి మద మాత్సర్యాలు తోడయితే విద్య వినయం బుద్ధి తపస్సు దగ్ధమైపోతాయని విష్ణుమూర్తి హెచ్చరిస్తాడు. మహాకావ్యాలు, ఉపనిషత్తులు, ధర్మ శాస్త్రాలు స్వయంగా చదివి అర్థం చేసుకోలేని వారికి ఈ సినిమాలు గొప్పగా ధర్మప్రబోధం చేస్తాయి. శ్రీరామ జననాన్ని ఆవిష్కరింపజేసే సన్నివేశాల్లో భారీ సెట్టింగులు మనలను త్రేతాయుగానికి తీసుకువెళతాయి. ఇక్ష్వాకు వంశం అంతటినీ వారి కీర్తి వైభవాలతో సహా ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం వారందరినీ అత్యంత రమణీయ శిల్పాలుగా దశరథ రాజ మందిరంలో నిలుపుతాడు బాపు. సంతానం కోసం అలమటించి ఆవేదన పడేటప్పుడు, శ్రీరాముడికి తమ వంశ ప్రతిష్ఠలు బోధించేటప్పుడు దశరథుడి నోట వీరి ప్రస్తావన వినిపిస్తాడు. ఇది మహా కావ్య రచనా లక్షణం. 'సీతాకళ్యాణం'లో పరమశివుడు తన అంశతో హనుమని ప్రభవింపజేయడం ఒక ఆహ్లాదకర దృశ్యం. ఋగ్వేద మంత్రాలతో సాగే యజ్ఞ యాగాదుల్లో, పుత్ర కామేష్టి చిత్రీకరించబడింది. శంఖచక్రగదాపద్మ సహితుడై శ్రీమన్నారాయణుడు భువిపై అవతరిస్తాడు. శ్రీహరి ఇంతకుముందు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ అవతారాల్లో లక్ష్మి సహితంగా అవతరించలేదు. తొలిసారిగా నాతో దిగివచ్చి ధర్మ సంస్థాపన చేయమని శ్రీహరి ఈ అవతారంలోనే లక్ష్మీదేవిని కోరతాడు.

శ్రీరామచంద్రుడి బాల్యాన్ని సీతాకళ్యాణం, సంపూర్ణ రామాయణంతో పాటు ఈ టి.వి. భాగవతంలోని రామాయణంలో కూడా చాలా రసవత్తరంగా చిత్రీకరించారు. ప్రత్యేకించి సినిమాల్లో చూపలేకపోయిన రామాయణ సన్నివేశాలని బాపు ఈ టి.వి. భాగవతంలో పది గంటలకు పైగా నిడివితో చిత్రీకరించారు. శ్రీరాముడిని క్షణమైనా విడలేని దశరథుడి పితృహృదయము, కౌసల్య కన్నా ఎక్కువగా శ్రీరాముడికై తపించే కైక హృదయం, వారికి దూరం కాబోతున్న శ్రీరాముడి సన్నిధిని పరోక్షంగా మనకు చెబుతాయి. ఎవరైనా దేనినైనా క్షణం విడువలేమని అంటే శాశ్వతంగా దూరమవుతాయనేది ఆధ్యాత్మిక సత్యం.

గుణదభిరాముడు శ్రీరాముడే

వాల్మీకి రామాయణం పదహారు సంపూర్ణ కళలతో కూడిన పదహారు గుణాలతో శ్రీరాముడిని శ్రీరామచంద్రుడిగా అభివర్ణించింది.
"ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః
విద్వాన్ కః కస్సమర్థశ్చక శ్చైక ప్రియదర్శనః
ఆత్మవాన్ కో జిత్రకోధో ద్యుతిమాన్ కో నసూయకః
కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే''
ఈ గుణాలు గుణవంతుడు, వీర్యవంతుడు, «ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు, చారిత్రవంతుడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ఏకప్రియదర్శనుడు ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, అనసూయుడు దేవతలకు కూడా భయం కలిగించేవాడు.

శ్రీరాముడి ఈ గుణాలన్నింటినీ రామాయణం సినిమాల్లో బాపు ప్రస్ఫుటంగా, కళాత్మకంగా ఔచిత్యవంతంగా భిన్న సందర్భాల్లో చిత్రీకరించాడు. జితక్రోధుడు అంటే క్రోధం లేని వాడని కాదు అర్థం. క్రోధాన్ని జయించిన వాడని అర్థం. తన వ్యక్తిగత విషయాల్లో ఎంతటి వేదన అనుభవించవలసి వచ్చినా ఆయనకి క్రోధం రాదు. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అధర్మాన్ని శిక్షించవలసి వచ్చినప్పుడు మాత్రమే, అవసరార్థం ఆయన క్రోధాన్ని తెచ్చుకుని, కార్య సమాప్తిలో తక్షణమే పరిత్యజిస్తాడు. కాబట్టే ఆయనకి వేదన కలిగే ఏ సందర్భంలోనూ క్రోధం రాదు. కైక వనవాసానికి వెళ్ళమన్నప్పుడు కాని, వాలిపై బాణం వేసే సందర్భంలో కాని, రావణాసురుడు తొలిసారి ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏకప్రియదర్శనుడు. సర్వభూత ప్రియుడు. ఈ గుణాలన్నింటినీ తన రామాయణాల్లో శ్రీరామ పాత్రలు ధరించిన వారి ద్వారా బాపు రమణలు అభినయింపజేశారు.
ధర్మం ఆకృతి వహించిన రూపమే రాముడు కాబట్టి ఆయనని 'రామో విగ్రహవాన్ ధర్మః' అన్నారు. అలాంటి రాముడిని హృదయాల్లో నిలిపిన వారికి శ్రీరామరక్ష లభిస్తుంది కదా. శ్రీరామతత్వాన్ని తన సినిమాలన్నింటిలోనూ బాపు రమణలు అంతర్లీనంగా చూపారు.

సంగీత నృత్య దృశ్యకావ్యం 'సీతాకల్యాణం'

శ్రీరాముడు 'పుంసాం మోహన రూపాయ' అన్నట్లుగా జగత్తునే మోహింపజేసినవాడు. వాల్మీకి రాముడిని 'రామః కమల పత్రాక్షః సర్వ సత్వ మనోహరః' అని అభివర్ణించాడు. ఆయన అద్భుత సద్గుణ సౌందర్యం రామాయణమంతటా అనేక సన్నివేశాల్లో బాపు చిత్రీకరించారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒక్క శ్రీరాముడిని మాత్రమే శ్రీరామచంద్రుడని అంటారు. జగత్తుని సమ్మోహనం చేసే శీతల ఆనందకర సద్గుణమూర్తి కాబట్టే ఆయన శ్రీరామచంద్రమూర్తి విషయాన్ని బాపు రమణీయంగా ధ్వనింపజేశాడు. బాలరాముడు, చంద్రుడు కావాలని మారాం చేస్తుంటే సంపూర్ణ రామాయణంలో ఆరుద్రగారి పాట.
'ఎందుకు ఆ చందమామ
అందగాడనా నీ కన్నా
అందరాడనా ఓ కన్నా
తరగని చక్కని జాబిలి... మా సరసనే ఉండగా

తరగని చెరగని వెన్నెల మా కనుల నిండగా'
అదే ఆరుద్ర రామచంద్రుడిని సీతాకళ్యాణంలో ఇలా దర్శింపచేస్తారు.
'చంద్రుని కోసం వెదికే ఇంకో చంద్రుని చూడాలి
అందని చంద్రుని క్రిందికి దింపిన అమ్మని చూడాలి
చంద్రుని చూచి నవ్వే ఇంకో చంద్రుని చూడాలి
రామచంద్రుని చూడాలి'


కొన్ని భావాలు వాచ్యంగా చెబితేనే తెలుస్తాయి. మరికొన్ని అభినయంలో చూపితేనే గ్రహించగలుగుతాము. మరికొన్ని సంగీతంలో వినిపిస్తేనే ఆనందం కలుగుతుంది. తాత్త్విక చింతనలు, అనుభూతుల రూపంలో క్రమక్రమంగా బోధించాలి. రసావిష్కరణలో బాపు రమణలు ఈ ఔచిత్యం పాటించారు. సీతాకళ్యాణం సినిమా ఒక విలక్షణమైన సినిమా, దాన్ని యక్షగానం అనాలో, సంగీత నృత్య దృశ్యకావ్యం అనాలో రసజ్ఞులు నిర్వచించాలి. దీనిలో సంభాషణలు చాలా తక్కువ. ముళ్ళపూడిగారు స్వయంగా ఈ విషయం నాకు స్క్రీన్‌ప్లే చూపుతూ వివరించారు. పాత్రల మనోభావాలన్నీ సంభాషణల ద్వారా తక్కువగాను; సంగీతం, నృత్యం, నేపథ్యం ద్వారా ఎక్కువగాను ఈ సినిమాలో కనిపిస్తుంది. కాబట్టే ఈ సినిమా ప్రపంచంలోనే అంతర్జాతీయ కళాత్మక చిత్రంగా ఖండాంతరాల్లో కీర్తిని ఆర్జించింది.

హనుమకి పరీక్ష 'శ్రీరామాంజనేయ యుద్ధం'

శ్రీరామ పాత్ర వేయడం కోసమే జన్మించిన వారు నందమూరి తారకరామారావు. ఆయన కోరికతో బాపు రమణలు శ్రీరామాంజనేయ యుద్ధం నిర్మించారు. ఎన్.టి.ఆర్. రాముడిగా, బి. సరోజ సీతగా, ఆర్జా జనార్దనరావు హనుమగా అపూర్వంగా నటించిన సినిమా ఇది. యయాతిగా ధూళిపాళ తన నటనా ప్రాభవం చూపారు. రామ నామానికి రామ బాణానికీ జరిగే పోరాటమిది. యయాతి వంటి రామభక్తుడికి ఎదురైన పరీక్ష. శరణన్న వారిని శ్రీరామ పాద సాక్షిగా శరణిచ్చిన హనుమకీ ఇది ఒక పరీక్ష.

శ్రీరామనామ వైశిష్ట్యాన్ని మధురంగా శక్తియుక్తంగా వివరించిన సినిమా ఇది. ధీరదాత్త ధీరశాంత ధీరాలలిత నాయకుడిగా సర్వ భావాలు పలికించడంలో ఎన్.టి. రామారావు అద్భుతంగా నటించారు. ఇలా చెబితే 'సూర్యుడి తేజస్సు ఇలా ఉంటుంది', 'చంద్రుడి వెన్నెల ఇలా ఉంది' అని చెప్పినట్లే. వారి నటనా ప్రాభవాన్ని బాపు సంపూర్ణంగా అభివ్యక్తం చేశారు. హనుమ భక్తి పారవశ్యం మనకందరికీ ఎంతో ఇష్టం. తనివి తీరా ఆయన చేత శ్రీరామగానం చేయిస్తాడు బాపు. సీతారాముల దాంపత్యం వారి మధుర సంభాషణలు మనకెంతో ఆనందం కలిగిస్తాయి. ఇంతకు పూర్వం ఇటువంటి దృశ్యాలు సినిమాల్లో మనకి కనబడలేదు. కాబట్టి అవి ప్రేక్షకులకు ఎంతో తృప్తి కలిగిస్తాయి.

శ్రీరామనామ కృతి కావ్యం 'త్యాగయ్య'

నాద బ్రహ్మోపాసనతో తారక మంత్రంతో తరించినవాడు త్యాగయ్య. శ్రీరామ నామ తత్వాన్ని కృతులుగా అందించాడు. ఈ చిత్రంలో ప్రతి త్యాగరాజ కృతి త్యాగరాజు జీవితంలోని ఒక్కొక్క సుఖ దుఃఖాది అనుభూతుల రూపంలో నుండి జయించినట్లు బాపు రమణలు చూపారు. సర్వకళలు అనుభూతి జనితాలే కదా. త్యాగరాజ కీర్తనల విషయంలో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. త్యాగరాజు జీవితమంతా ఒక్కొక్క ఘట్టంలో పొందిన వేదనని, భక్తిని, పారవశ్యాన్ని, విచికిత్సని, అన్వేషణనీ తాను అనుభవిస్తూ కంఠంలో అభినయిస్తూ జె.వి. సోమయాజులు నోట పలికాడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం.

నాటి సీతకు సాంఘిక రూపకల్పన 'ముత్యాల ముగ్గు'

రామయణానికి సాంఘిక రూపకల్పన ముత్యాలముగ్గు. భారతీయుల జీవిత ధర్మంలో అణువణువునా రామాయణమే నిండి ఉన్నది. భారతీయ స్త్రీ స్వభావాన్ని, సౌశీల్యాన్ని త్రేతాయుగంలో ఎంత గొప్పగా కీర్తించారో కలియుగంలోను అంత విశేషంగానూ చెప్పుకుంటున్నారు. ఇల్లు అంటే ఇల్లాలే అనేదే భారతీయ సంస్కృతి. యుగాలు మారినా స్త్రీ ఆత్మవిశ్వాసంలోను, ఆత్మాభిమానంలోను స్త్రీ ఔన్నత్యం సార్వకాలికంగా ఎలా నిలిచి ఉన్నదో 'ముత్యమంత పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత చాయ'గా ఈ సినిమాలో ప్రకాశించింది. తమలపాకు, వక్క, సున్నం మూడు కలిసి తాంబూలమైన రీతిని భారతీయ వైవాహిక వ్యవస్థగా ఈ సినిమాలో బాపు రమణలు చూపారు.

సీత పాత్రకి సంగీత ప్రతీక. కొత్త పెళ్లికూతురుగా "కన్నె పిల్ల మనస్సు అద్దం లాంటిది. అందులో తాళిగట్టిన భర్త బొమ్మ పడగానే అది పటంగా మారుతుంది'' అంటుంది. ఏ ఋజువులు, సాక్ష్యాలు, విచారణలు లేకుండానే సీతమ్మలా పరిత్యజించబడుతుంది. ఆత్మాభిమానమే కొండంత అండగా జీవిస్తుంది. భక్తుల హృదయమే భగవంతుడి నివాస స్థానం అనే భారతీయ భావనకు ప్రతీకగా భావనారూప ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. నిజం తెలిసిన మామగారు తిరిగి ఇంటికి రమ్మన్నా "సిఫార్సులతో కాపురాలు చక్కబడవు, నేనేమిటో తెలుసుకుని, ఆయనే రమ్మని నన్ను పిలవాలి. అందాక నాతోనే ఉండండి... నాకు ముగ్గురు పిల్లలు అనుకుంటాను'' అంటుంది ఆధునిక సీత మామగారితో.

సీతారాముల కల్యాణ వైభోగం 'అందాల రాముడు'

రామాయణంలో పాత్రలన్నింటి స్వభావాలనీ బాపు రమణలు అందాల రాముడు సినిమాలో చూపారు. గోదావరిపై శ్రీరాముడి కళ్యాణానికై సాగే భద్రాద్రి యాత్రలో మన జీవిత ప్రస్థానం కనిపిస్తుంది. అందరి హృదయాల్లోను భక్తి ఉన్నప్పటికీ ఒక్కొక్కరి ప్రవృత్తి ఈర్ష్య, అసూయ, స్వార్థం, నీచత్వం, కష్టాలు, కన్నీళ్ళు కలిసి పంచుకునే మానవత్వం ఒక «ధర్మం అంతర్లీనంగా కలిసి జీవితాన్ని ఒక్కొక్క విధంగా వీరు చూపారు. వీరందరి మనస్తత్వాలకి సమతుల్యత కల్పిస్తూ అక్కినేని రామాయణం ప్రతిఫలింపజేసిన జీవిత కథానాయకుడిగా కనిపిస్తారు.
***

శబ్ద స్పర్శ రూప రస గంథాలని మనస్సుతో ఆస్వాదిస్తే వచ్చే అనుభూతి అక్షరంలో పలకడం కేవలం బాపు రమణలకే సాధ్యం. శ్రీరామనామం రమణీయంగా మధురంగా సంగీత సాహిత్య నృత్య కళల్లో రసజ్ఞుల హృదయాల్లో శాశ్వతంగా నిలిపారు బాపు రమణలు.
కళా సౌందర్యాన్ని జ్ఞాన రూపంలో అందించడం బాపు రమణల ప్రతిభకు ఒక నిదర్శనం. వాల్మీకిది ధర్మ దృష్టి. వ్యాసుడిది జ్ఞాన దృష్టి. తిక్కన కాళిదాసాదులది రస దృష్టి. ఈ మూడూ కలిపితే వచ్చే దర్శనం బాపు రమణల రామాయణ దర్శనమవుతుంది.

* డా. పి.ఎల్.ఎన్. ప్రసాద్ * సెల్ : 98665 65863

Monday, March 7, 2011

రసానంద రమణుడు

హాస్యం అంటే మనం నవ్వుకోవడమే కదా అనుకుంటాం. కాదేమో! ఎదుటివాడితో సహా కలిసి నవ్వి నవ్వించడమే హాస్యం అంటారు 'ముళ్లవాడి వ్యంగ్యట రమణ'. ఆయన నాయికల్లో ఓ నాయిక "నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు. ఏడుపొచ్చినప్పుడు కూడా నవ్వేవాడే మనిషి'' అంటుంది. తన కన్నీళ్ల మీద, అసమర్ధతల మీద, పనికిరానితనం మీద జోకులేసుకుని హాయిగా నవ్వుకునే ముళ్లపూడి 'అప్పారావు' మన గుండెల్లో ధైర్యాన్ని నింపుతాడు. జనతా ఎక్స్‌ప్రెస్ లాంటి మధ్యతరగతి జీవిత మందహాసాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. మంచి మనిషి, చెడ్డమనిషి అంటూ ఇద్దరు లేరు. మంచీ చెడూ కలిస్తేనే మనిషి అంటారు ముళ్లపూడి.

లోకంలో ఎన్నిరకాల నవ్వులున్నాయో ముళ్లపూడి తన సాహితీ దర్పణం లో చూపిస్తాడు. ఖరీదైన జరీకండువా గుబురు మీసాల నవ్వులు, అందమైన రాధమ్మ సిగ్గు దొంతరల మల్లెపూల పరిమళాల నవ్వులు, తన చాతకానితనం మీద తనే జోకు వేసుకుని నవ్వే అసమర్థపు నవ్వులు... జేబులో ఉన్న ఒక్క రూపాయి తనని చూసి నవ్వుతుంటే దాని నోరుమూయించి,కొడుక్కి మూడు చక్రాల సైకిలు బేరమాడి, ఖరీదుగా కనిపించాలని షావుకారుతో మధ్యతరగతి తండ్రి నవ్వులు వినిపిస్తాడు- నవ్వుల మీద కాపీరైటున్న ముళ్లపూడి.

'హన్నా' అనిపించే ప్రేమ కథలవి


గ్రాంధికం పట్టు ఇంకా సడలని 1950ల్లోనే ముళ్లపూడి అందమైన తెలుగు పదాలతో కథల్ని సృష్టించాడు. పట్టు వదలని విక్రమార్కుల లవ్వు కథలు, ఇద్దరమ్మాయిలు - ముగ్గురు అబ్బాయిల కథలు 1955లోనే ముళ్లపూడి రాశాడంటే 'హన్నా' అని ముళ్లపూడి స్టైల్లోనే పాఠకులు 'హాచ్చెర్యపడిపోతారు'. ఒకే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగలిగిన గోపాలం లాంటి ఏకలవ్యుల నుండి, ఓ ప్రభావతికి బీటేసే మూడవ నెంబరు ప్రద్యుమ్నుడు వరకు ఎందరో లవ్వుకుమారులు 'భగ్నవీణలు బాష్పకణాలు' మొదలైన కథల్లో కనిపిస్తారు.

'గౌరి'ని సృష్టించింది రమణే


రక్తసంబంధం వంటి అనురాగభరిత, దుఃఖపూరిత విషాదాంత సినిమా కథతో ముళ్లపూడిగారి సినిమా జీవితం ప్రారంభమయింది. మూగమనసులు సినిమా కథ ముళ్లపూడి చేతికి వచ్చి, అందమైన మలుపులు తిరిగింది. ఆత్రేయ స్క్రిప్టు రాసి ఇచ్చాక ఆదుర్తి సుబ్బారావుకి పాత్రల మధ్య ప్రేమ నచ్చలేదట. 'పడవ నడుపుకునేవాడికి, 'అమ్మాయి'గారికి మధ్య లవ్వు బాలేదు' అని ఆదుర్తి అంటే- ముళ్లపూడి సృష్టించిన మూడో పాత్ర గౌరి అట.

ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం


తెలుగు సినీ ప్రపంచంలోని ప్రముఖులందరినీ పరిచయం చేశారు ముళ్లపూడి. అక్కినేని నాగేశ్వరరావుగారిపై 'క«థా నాయకుడి కథ' చాలా సుప్రసిద్ధమైనది. అక్కినేని సినీ జీవితాన్ని, నిజ జీవితాన్ని ఏకకాలంలో అద్దం పట్టి చూపాడు. 'జూల్స్‌వెర్న్' రాసిన ఆంగ్ల నవలకి 'ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం' ముళ్లపూడి రాసిన అనువాద నవల. అందులో అచ్చ తెలుగు నుడికారం కనిపిస్తుంది. 'దున్నలొస్తే రైళ్లాపుకుంటామా, దున్నలని దున్నవతల పారేయక చూస్తారే' అంటారు పాస్పార్తు ఫ్రెంచి ఆవేశంతో ఒకదగ్గర.

'ముత్యాలముగు'్గ హాస్యం పేలింది


హాస్యం అంటే ముళ్లపూడి మాటల్లో... 'నా మటుకు నాకు హాస్యం అనేది దృశ్యపరంగా ఉంటేనే బాగుండుననిపిస్తుంది. కామెడీలో డైలాగ్ అనేది వేరే డిపార్ట్‌మెంట్, మన తెలుగు సినిమా అంతా ఎక్కువ డైలాగ్స్ మీద ఆధారపడిన కామెడీనే. ఆ విధంగా నేను రాసిన వాటిల్లో రావుగోపాలరావుగారి మీద భక్త కన్నప్పలో కానీ, ముత్యాలముగ్గులో కానీ అంతా డైలాగ్ ఓరియెంటెడ్ కామెడీనే. హాల్లో ప్రేక్షకులు నవ్వినంత మాత్రాన అది మంచి కామెడీ అని అనుకోవడానికి వీల్లేదు. 'అందాల రాముడు' సినిమా చూస్తూ 'సిల్వర్ జూబిలీ' అవుతుందని మేము అనుకునేటంతగా జనం నవ్వారు. కాని అది ఏవరేజ్ అయింది. 'ముత్యాల ముగ్గు' సినిమా హాల్లో పెద్దగా ఎవరూ నవ్వలేదు. కాని అదే అత్యధిక ప్రజాదరణ పొందిన హాస్యం అయింది.'

'బొమ్మ' బాపు - 'ఆత్మ' ముళ్లపూడి


నిజానికి బాపు అంటే ముళ్లపూడి. ముళ్లపూడి అంటే బాపు. సాక్షి సినిమాతో ప్రారంభమైన వారి సినీ జీవిత కావ్య రచన ప్రస్తుత బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' దాకా అప్రతిహతంగా సాగింది. బాపుగారితో "మీరింత గొప్పగా సినిమా తీస్తారు కదా...'' అని నేను అన్నప్పుడు, బాపు గారు కట్ చేసి "అసలు ఆ గొప్పతనమంతా రమణ స్క్రిప్టులోనే ఉందండి. మొత్తం ఆయన ప్రతి కోణం రాసి ఇస్తేనే ... నేను తీస్తాను'' అన్నారు. కథానాయికల కట్టూబొట్టూ నడక వయ్యారం కులుకు కలిసి బాపు బొమ్మ తయారయితే అందులో ఆత్మ ముళ్లపూడిది.

సీగాన పెసూనాంబ


ఆయన అల్లరి బుడుగు ఇంటింటా కనిపిస్తాడు. పిల్లల్లోని చిన్ని చిన్ని సరదాలని, పెద్దల చిన్న మనసులని కూడా ముళ్ళపూడి 'బుడుగు'లో చూపుతాడు. భాష కూడా చిత్రంగా ఉంటుంది. "సీగాన పెసూనాంబ''. "గుండు మీద గాఠిగా ప్రైవేటు చెప్పేయడం'', "జాఠర్ ఢమాల్'' లాంటివి.

బాలకృష్ణతో ఆ కోరిక తీర్చాడు


బాపు సినిమాల్లో ముళ్ళపూడి సృష్టించిన నాయికలు ఎంతో అందంగా కనిపిస్తారు. బాపు రమణలని ఒకసారి అడిగాను. 'మీ సినిమాల్లో హీరోయిన్ల కళ్ళు మరీ అంత అందంగా ఎలా ఉంటాయండీ' అని. బాపు నవ్వి "అలా రాశాడు రమణ'' అన్నాడు. ముత్యాలముగ్గులో సంగీత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన 'సీతాకళ్యాణం' చిత్రీకరణ అపూర్వం. ప్రతి సన్నివేశంలో భావాన్ని సంపూర్ణంగా బాపు రమణలు వినూత్న రసావిష్కరణ చేస్తారు. నేపథ్యంలో కొంత, సంగీతంలో కొంత, సాహిత్యంలో కొంత, నటుల ఆహార్యం కెమెరాలో చూపిన తరువాత సంభాషణ ప్రారంభమవుతుంది. అంటే ఈ ఐదు విభాగాలని కలిపి చూసినప్పుడే రసాన్ని ఆస్వాదించగలమేమో అనిపిస్తుంది.

'సంపూర్ణ రామాయణం' అంత పెద్ద సంచలనమా! కాని 'ఓ కార్టూనిస్టు, కమ్యూనిస్టు, జోకర్ కలిసి రామాయణం తీస్తారట' అని ఆ రోజుల్లో విమర్శించారట. ఎన్టీఆర్ కూడా అలిగారట. ఆ త్రయం బాపు రమణ ఆర్రుదలు. సంపూర్ణ రామాయణం సినిమాలో ఆరుద్ర పాటలు, ముళ్ళపూడి సంభాషణలు ఇప్పటికీ మారుమోగుతుంటాయి. ఆద్యంతం రామాయణం చూపిన సినిమా ఇదొక్కటే. తర్వాత ఎన్టీఆర్ కూడా భేష్ అని మెచ్చేసుకుని, బాపు రమణలని లవకుశ తనతో మళ్లీ తీయమని కోరారట. ఆ కోరిక అప్పుడు ఆయనకి తీరలేదు కాని, ముళ్ళపూడి రచనతో ఇప్పుడు శ్రీరామరాజ్యంగా బాలకృష్ణగారితో తీరబోతోంది.

ఆత్మాభిమానం కథానాయికలు


మిస్టర్ పెళ్లాం, రాధాగోపాలం, పెళ్లిపుస్తకం సినిమా కథల్లో ముళ్ళపూడి ఆత్మాభిమానం కల నాయికలని సృష్టించాడు. 'మగవారికి అహంకారం ఎక్కువ. ఆయన ఇప్పుడు మా ఆయన కాబోతున్నాడు కదా. దాన్ని ఆత్మవిశ్వాసం అనాలేమో అంటుంది' ఓ నాయిక. రాధాగోపాలం కథ, సినిమా రెండూ వేరు వేరు. 'మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం. ఆడవాళ్ళు కాస్త తక్కువ సమానం' అంటాడు ముళ్ళపూడి రాధాగోపాలంలో వ్యంగ్యంగా.
రాధాగోపాలం కథలో గోపాలం రాధని వైకేరియన్ లయబిలిటీ క్రింద మీ నాన్నని డబ్బులు కట్టమని అంటాడు. ఇదో గొప్ప లయబిలిటీ. ఇంతకీ ఏమిటి అది అంటే రాధ అందంగా రెండు చిరునవ్వులు నవ్వితే స్నేహితులకి గోపాలం ఇచ్చిన పార్టీలు. "ఎస్టాబ్లిష్‌మెంట్ ఛార్జీలు అయ్యాయి. మీ నాన్నని ఇవన్నీ కట్టమను'' అంటాడు. ఇలాంటి చార్జీలు వైకేరియన్ లయబిటీలు ఈ యువతరంలో చాలా ఎక్కువేమో.

అద్భుత 'కానుక'


ఆయన కథల్లో ఆణిముత్యం 'కానుక'. ఈ కథలో గోపన్న మురళీగానప్రియుడు. నిత్యం శ్రీకృష్ణుడిని బృందావనంలో చూస్తుండేవాడు. ఆ మురళీగానంలో కరిగి ప్రవహించేవాడు. కృష్ణుడి మువ్వల మురళి లాంటి మురళి తానూ తయారుచేయాలనుకున్నాడు. కృష్ణుడు నాట్యం చేస్తుంటే ఆ మురళిని ఎత్తుకొస్తాడు. తెల్లారంగానే కృష్ణుడు చావిట్లోకి వచ్చి "గోపన్నా! నా మురళి ఎత్తుకు పోయావు కదూ! పోనీలే ఇంకోటి చేసీయి'' అంటాడు. ఈ గజదొంగ దగ్గర నేను దొంగతనం చేయడమేమిటి అనుకుంటాడు గోపన్న. వేణువు కోసం యజ్ఞం ప్రారంభమయింది. ఎన్ని చేసినా ప్రతి మురళిలో ఏదో ఒక లోపం. సంవత్సరాలు గడిచిపోయాయి. గోపన్నకి చిన్న గోపన్న పుట్టాడు. అయినా కాలంతో పాటు గోపన్న పట్టుదల పెరిగింది. కృష్ణుడు చివరిసారి రేపల్లెకి వచ్చాడు. ఇప్పటికీ ఇవ్వలేకపోతే తన జన్మ వ్యర్థం. తన శక్తినంతా ధారపోసి ఒక మురళిని చేసి కొడుకు చేతిలో పెట్టి 'తెల్లవారితే కృష్ణాష్టమి. రేపు దీనిని కృష్ణుడికి ఇవ్వు' అంటాడు. చిన్న గోపన్న అటక మీద ఉన్న వేల మురళుల్లో పొరపాటున దానిని కలిపేస్తాడు.

ఇప్పుడు ఆ మురళి ఎలా దొరుకుతుంది? గోపన్న ప్రతి మురళిని వాయించి చూస్తాడు. ఇది కాదు.. ఇది కాదు.. 'న ఇతి వాదం' 'నేతివాదం' చిట్టచివరికి ఒకే మురళి మిగులుతుంది. దాన్ని పరీక్షించే సాహసం లేకపోయింది గోపన్నకి. 'ఇదే' అని చివరి మురళిని చిన్న గోపన్నకి ఇచ్చి పంపుతాడు. జీవితంలో మొదటిసారి నడుము వాలుస్తాడు. తాను పనికిరావని విసిరిపారేసిన వేణువులన్నీ వేయి నాదాలతో అద్భుతంగా వేణుగానం ఆలపిస్తాయి. 'అయ్యో ఎంత పొరబాటు' అద్భుత గాన సౌందర్యం ఆ విశ్వమోహనుడి జిలిబిలి పెదవులది కాని, ఈ వెదురు ముక్కది కాదు కదా... ఆ పెదవి సోకిన ప్రతి మురళి నాదం పలుకుతుంది. సృష్టిలో పనికిరాని మురళే లేదు. ప్రతి వ్యక్తి ఒక మురళే. ఈ రహస్యం తెలియడానికి ఒక జీవితం పట్టిందా ప్రభూ! అంటాడు గోపన్న. ఈ కథ కధానికా ప్రపంచం ఉన్నంతకాలం నిలబడుతుంది.
టీవీకి భాగవత కథలు రాసినా, బాపు రామాయణాల్లో రామకథలు రాసినా ... బుడుగు చేతల్లో, అప్పారావు ఋణానందలహరిలో, లవ్వు కథల నుండి శ్రీకృష్ణుడి లీలా మానుష కార్యాల దాకా ముళ్ళపూడి విశ్వరూపం కనిపిస్తుంది. 'మేడ మీద మేడకట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందూ' అని 'ప్రేమించి చూడు'లో రాసినా, భాగవతంలో కృష్ణుడిపై పాటలు రాసినా ఆ కలం ఏ ప్రక్రియకైనా రసాలు ఒలికిస్తుంది. జీవితంలోని సమస్త అనుభూతులను మనకి ముళ్ళపూడి దర్శనం చేయిస్తాడు.


- డా. పి.ఎల్.ఎన్. ప్రసాద్
98665 65863

Thursday, February 24, 2011

ముళ్లపూడి - పెళ్లిపుస్తకం

నిజమైన ప్రేమ కొడిగట్టని దీపం. దానిపై అనుమానపు నీడలు నిలువలేవు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తుంది భామ. బాసుగారి అమ్మాయితో భర్త కృష్ణమూర్తి చనువును భరించలేకపోతుంది. నువ్వనుకుంటుంది కరెక్ట్ కాదని కృష్ణమూర్తి ఎంత చెప్పినా వినదు. ‘‘నేను మీకు అక్కర్లేదు అనుకునప్పుడు, మీరూ నాకు అక్కర్లేదు’’ అని తెగేసి చెబుతుంది. ‘‘భర్త తిట్టినా కొట్టినా మీరే దైవం అనే పతివ్రతను కాను. నాలాంటి మరో బుద్ధితక్కువ పిల్ల మీలాంటి వాళ్ల వల్లో పడి అన్యాయమైపోతుంటే నాకేంటి అని ఊరుకునే ఆడదాన్ని కూడా కాదు. రేపే మీ బండారాన్ని బాసుగారి ముందు బద్దలు కొట్టేస్తా’’ అని చెప్పి సీరియస్‌గా వెళ్లిపోతుంది.

భార్య తొందరపాటు తనాన్నీ చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థంకాదు కృష్ణమూర్తికి. తెల్లారితే బాసు షష్టి పూర్తి. భార్య ముందు చేతులు జోడించి నిలబడతాడు. ‘‘నేను నీచమైన డబ్బుకోసం గొంతులు కోసే కిరాతకుడ్నని తేల్చేశారు. డబ్బెంత నీచమైందైనా... ఇప్పుడది నాకవసరం. ఇంకో పదిరోజుల్లో మా చెల్లెలు గుండె ఆపరేషన్ ఉంది. ఈ రోజు పనివాళ్లకు బాస్ బోనస్ ఇస్తున్నారు. మీరివాళే నా బండారం బద్దలు కొట్టి... బాసుగారి అమ్మాయిని నా కుట్ర నుంచి కాపాడతానన్నారు. అది ఒక్క రోజు ఆపండి. వెయ్యి అబద్దాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క నిజాన్ని ఒక్క పూట ఆపి నా చెల్లికి ప్రాణదానం చెయ్యండి’’ అని భార్యను బ్రతిమాలతాడు. భామ ఆలోచించి అప్పటికి ఆగుతుంది.

కాపురానికి పునాది నమ్మకమని షష్టిపూర్తిలో బాసుగారి భార్య చెప్పే మాటలు భామను ఆలోచింపజేస్తాయి. అప్పుడే బాసుగారి కూతురు మరొకర్ని ప్రేమిస్తుందన్న నిజాన్ని కూడా తెలుసుకుంటుంది. భర్త విషయంలో తాను చేసిన తప్పుకు కుమిలిపోతుంది. ఇక ఒక్క క్షణం కూడా భర్తకు దూరంగా ఉండలేకపోతుంది. తనతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు ఆ అవకాశం ఇవ్వడు కృష్ణమూర్తి. పుణ్యదంపతుల తాంబూలం అందుకునే ఘడియ రానేవస్తుంది.


ఆపద్ధర్మంగా తెచ్చుకున్న అద్దెమొగుడుతో అగ్నిహోత్రం ముందు నిలబడుతుంది భామ. అగ్నిదేవుడు భగ్గుమంటాడు. ఆ పాపాన్ని, ఈ భారాన్ని భరించలేని భామ ఆర్తనాదంచేసి కుప్పకూలిపోతుంది. సొమ్మసిల్లుతున్న భార్యను చేతుల్లోకి తీసుకుంటాడు కృష్ణమూర్తి. గట్టిగా గుండెలకు హత్తుకొని ఓదారుస్తాడు. ‘‘నిజాన్ని నీకు నువ్వుగా తెలుసుకోవాలని నిన్ను బాధపెట్టాను. ఈ బాధ మంచిది. అగ్నిగుండం ముందు నీ అనుమానం ఆవిరైపోయింది. నీ కన్నీరు నీ గుండెను కడిగి శుభ్రం చేసింది. ఇక కీడు క్రీనీడ కూడా మనమీద పడదు. ఇక నుంచి మన పెళ్లిపుస్తకంలో అన్నీ మంచి పేజీలే’’ అని భామ కన్నీళ్లను తుడుస్తాడు కృష్ణమూర్తి.

పెళ్లంటే... పాలల్లో పాలులా కలిసిపోవడం. పంచదారలా కరిగిపోవడం. పెళ్లంటే నమ్మకం. పెళ్లంటే భరోసా. పెళ్లంటే విడదీయలేని బంధం. దాన్ని గొప్పతనాన్ని గొప్పగా ఆవిష్కరించింది ‘పెళ్లిపుస్తకం’. ఇందులో ప్రతి పేజీ అందమైనదే. తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా. ముళ్లపూడి రచన, బాపు దర్శకత్వం ఈ చిత్రాన్ని క్లాసిక్‌ని చేశాయి. ముళ్లపూడి భౌతికంగా మనకు దూరమమైనా... చిత్రసీమపై ఆయన చల్లిన విలువలు ఎప్పటికీ పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి.

- బుర్రా నరసింహ


ముళ్లపూడి వెంకటరమణ స్మృత్యర్థం * పాట
 
పల్లవి :
మేడమీద మేడగట్టి కోట్లు
కూడబెట్టినట్టి కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
అందుకుంటే జుట్టుపట్టి
అందకుంటే కాళ్లుకట్టు కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
దిగి రాముందు ॥
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ (3)
చరణం : 1
ఆడపిల్ల మాటమీద ఉద్యోగాలు
ఊడగొట్టు ఆకతాయి కామందు
మీసకట్టు తీసివేసి కాసపోసికోకచుట్టి
గాజులేసికొమ్మందు ॥
డొక్కచీరివేస్తాము డోలుకట్టి తెస్తాము
డోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం

బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ (3)
చరణం : 2
రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా (2)
రేపటి వేళకు నీ పని మీదని దారికి రాకుంటే
మాపటి వేళకు మీ పని నేపడతానోయ్
బుచ్చబ్బాయ్
మిన్ను విరిగి మీదపడ్డ మన్ను మిన్ను ఏకమైనా
నిన్ను గెలిచే వరకు మేము
ఆడితీరుతామ్ పోరాడితీరుతామ్
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ (3)

బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ (3)
చిత్రం : ప్రేమించిచూడు (1965)
రచన : ముళ్లపూడి వెంకటరమణ
సంగీతం : మాస్టర్ వేణు
గానం : పి.బి.శ్రీనివాస్, బృందం

                                            *    *    *
ముళ్లపూడి వెంకటరమణ స్మృత్యర్థం * పాట 2
పల్లవి :
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో

నాదు మొరకాస్త ఆలించి నిదురపో
అందగాడా నిదురపో చందురూడా నిదురపో అందగాడా నిదురపో చందురూడా నిదురపో

చరణం : 1
ఇల్లంతా కడగాలి కళ్లాపి చల్లాలి
ముగ్గులు పెట్టాలి గోపాలుడా
కాఫీలు కలపాలి టిఫినీలు చెయ్యాలి
చెంగు విడి చిపెట్టు గోపాలుడా
చెంగు విడి చిపెట్టి సెలవిచ్చి పంపితే
మాపటేళకు మళ్లీ వస్తాను
తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టి
గుమ్ము గుమ్మను కౌగిలిస్తాను
గుండెలో వలపంతా గుమ్మరిస్తాను
చెంగు వదలర సామి గోపాలుడా
సరుసుడ నా సామి గోపాలుడా

చరణం : 2
సుప్పనాతి సూరీడొచ్చెను
వెన్నెలంతా ఎరబ్రారెను
మల్లెలన్నీ నల్లబోయెను కలువకన్నియ
కందిపోయెను కమిలిపోయెను కానుకో
కంటినిండా నిదురాకోసం
కాచి ఉన్నది చూసుకో రసికరాజ నిదురపో
ధిక్తన ధిక్తన ధిక్తన ధిన ధిక్తన ధిక్తన ధిక్తన
మూడు జాములు తిరగాలేదు
నాలుగోది పొడవాలేదు
తొందరెందుకు సూరీడా ఎందుకొస్తివి సూరీడా
నిన్నెవరు పిలిచారు సూరీడా
నీకిక్కడేమి పని సూరీడా
నీకెప్పుడేమి పని సూరీడా...
పోరా పోరా సూరీడా రారా సూరీడా
పోరా పోరా...
చిత్రం : రాధాగోపాళం (2005)
రచన : ముళ్లపూడి వెంకటరమణ
సంగీతం : మణిశర్మ
గానం : మురళీధర్, చిత్ర
 
                       *                      *                          *
 

రమణీయం.. సదా స్మరణీయం

ramana3ఒక్క తెలుగు వారికే సొంతమయిన అరుదయిన జంట...తనువు మనస్సూ ఒకటిగా మెలిగిన అపురూప స్నేహితులు... తెలుగు సినిమాకి, తెలుగు సాహిత్యానికి ఓ గుర్తింపు తెచ్చిన మహనుభావులు... బాపు, రమణ. ఇంతకాలం వాళ్ళిద్దరి పేర్లు కలిపి చదవాటానికి అలవాటుపడ్డ మనం.. వాళ్ళిద్దరినీ జంటగా చూడ్డమే అలవాటయిన మనం.. ఇకనుండి ఒట్టి బాపు గారినే చూస్తాం అనుకుంటే ఎంత బాధగా ఉందో! మనకే ఇంత బాధగా ఉంటే బాపు గారికి ఇంకెంత తీరని లోటు! ఆ క్షణం దాకా తనతో ఉన్న తన సహచరుడు ఇక తనతో లేడు అనుకుంటే...మీ ఇద్దరూ కలిసి తెలుగు వారికి ఓ బుడుగుని... ఓ సీగానపెసూనని...ఓ రెండు జళ్ళ సీతని....ఓ గోపాలాన్ని...అన్నిటికీ మించి ఓ కోతికొమ్మచ్చిని ఇచ్చినందుకు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం అని తెలుగువారు కళ్లనీళ్ల పర్యంతమవుతున్నారు. బాపు, రమణలు కలిసి తెలుగు సినీరంగంలో దృశ్య కావ్యాలుగా పేరుగాంచిన హిట్‌ సినిమాలెన్నింటినో రూపొందించారు. ఈ క్లాసిక్‌ చిత్రాలు తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా చిలిచిపోతాయి.

- హాస్య రచనలతో సుప్రసిద్ధులుగా..

- బాపు, రమణలది ఆరు పదుల చెలిమి బంధం

- చివరి సినిమా శ్రీరామరాజ్యం

- ఆంధ్రపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా చేసి...

- బుడుగు రచనతో పేరుతెచ్చుకొని...

-ముత్యాలముగ్గు, పెళ్లిపుస్తకం, మిస్టర్‌ పెళ్లాం వంటి హిట్‌ సినిమాలు
- తెలుగు సినిమాలో విలనిజానికి కొత్త రూపం

- గిలిగింతలు పెట్టే డెైలాగులకు పెట్టింది పేరు

- మాటల మాంత్రికుడు

- ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు
ramana2 ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్‌ 28న ధవళేశ్వరంలో జన్మించారు. ఈయన అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం. గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవారు. వారి పూర్వీకులు బరంపురంకు చెందిన వారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. దీనితో కుటుంబం ఇబ్బందులలో పడిం ది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్‌.స్కూలులో చదివారు. 7,8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్‌ దాకా కేసరి స్కూలులోను చదివారు. పాఠశాల విద్యార్ధిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించారు. హాబీగా పద్యాలు అల్లేవారు. నాటకాలలో వేషాలు వేసేవారు కూడా.

ముళ్లపూడి వారి బుడుగు
ramana4 ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు... బాపు బొమ్మల ద్వారా హా స్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్త్తకంలో వివరించారు రమణగారు. తెలుగు సాహిత్యంలో ఈ తరహా పుస్త్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును.ముళ్ళపూడి రచనలు ముళ్ళపూడి సాహితీ సర్వస్వం అనే సంపుటాలుగా లభి స్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదం బ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం బాలరమణీయం బుడుగు. ఇది ఎమ్బీఎస్‌ ప్రసాద్‌ సంపాదకత్వం (ముందుమాట)తో వెలువడింది. ఈ రచన ప్రశంస ఆరుద్ర కూనలమ్మ పదాలులో ఇలా ఉంది. ‘హాస్యమందున అఋణ...అందె వేసిన కరుణ...బుడుగు వెంకటరమణ...ఓ కూనలమ్మా!

ఇలా ఆరుద్ర చెప్పినట్లుగా ముళ్ళపూడి వెంకటరమణ బుడుగు వెంకట రమణగా అయ్యారంటే ముళ్ళపూడి సృష్టించిన పాత్రలన్నింటిలోనూ బుడు గు ఎంత ప్రసిద్ధమయ్యాడో తెలుస్తుంది. నవంబరు 1956 నుండి ఏప్రిల్‌ 1957 వరకు ఆంధ్రపత్రిక వార పత్రికలో సీరియల్‌గా వచ్చింది. అప్పుడు రచయిత అసలు తన పేరు వేసుకోలేదు. చివరికి అందరి బలవంతం వల్ల ఇది వ్రాసి పెట్టినవాడు - ఫలానా, బొమ్మలు వేసిపెట్టినవాడు - ఫలానా అని ఆఖరు సంచికలో వేశారు. అప్పుడు వీక్లీ సీరియల్‌కు పెట్టిన పేరు బుడుగు - చిచ్చర పిడుగు 24.4.1957లో బుడుగు స్కూల్లో చేరడానికి, అల్లరి మానే యడానికి నిశ్చయించుకోవ డంతో సీరియల్‌ ఆగిపో యింది. నాలుగేళ్ళ తరు వాత ‘వురేయ్‌, మళ్ళీ నేనే’ అని పాఠకులను అలరిస్తూ వచ్చాడు. అప్పటికి కాస్త తెలివి మీరాడు. అణ్వస్త్ర భయం గురించి, మేష్టర్ల జీ తాల గురించి కూడా మా ట్లాడేవాడు బుడుగు.

బుడుగు పాత్ర సృష్టికి సు ప్రసిద్ధ ఆంగ్ల కార్టూన్‌ డెని స్‌ - ది మెనేస్‌ స్ఫూర్తి అని అంటుంటారు. ఇది ఎంత నిజమో తెలియదు కానీ ముళ్ళపూడి వెంకట రమ ణను చిన్నప్పుడు బుడుగు అని పిలిచేవారట.

1. డెనిస్‌, బుడుగు పాత్రలలో నూ, వారి పరిజనాలలోనూ సాహిత్యం ఉన్నదనుకొన్నా బుడుగు పరివారం, ఆలోచనలు, భాష అన్నీ పక్కా తెలుగు వాతావరణమే. ఆలోచించి చూస్తే డెనిస్‌ కంటె బుడుగు పాత్ర విస్తృతి ఎక్కువ (సమిష్టి కుటుంబం కారణంగా కావచ్చును).


బాపు బొమ్మలు: బుడుగు సృష్ట్టిలో బాపు పాత్ర చాలా ముఖ్యమైనది. పత్రిక లో వచ్చిన బుడుగు బొమ్మలే కాకుండా బుడుగు పుస్త్తకం ఒకో ప్రచురణలో ఒకోలాగా చిత్రిస్తూ కొత్తదనం మెయింటెయిన్‌ చేశారు. బాపు బొమ్మ వెబ్‌ సైటులో బుడుగు బొమ్మలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.

బుడుగు పరిచయం: ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. ... ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావ లిస్తే మా నాన్నని అడుగు అని మొదట్లో బుడుగు తనను పరిచయం చేసు కుంటాడు...

బుడుగు కుటుంబంలో మనుషులు: నాన్న (గోపాళం), అమ్మ (రాధ) అమ్మా నాన్నా నిఝంగా కొట్టరు. కొట్టినా గట్టిగా కొట్టరు. ఉత్తుత్తినే.

బామ్మ : బుడుగును హారి పిడుగా అంటుంది. బుడుగును వెనకేసుకొస్తుంది. ఇక బాబాయి రెండుజళ్ళ సీత వస్తుంటే విజిలేయమంటాడు. వీడి దగ్గిర బోల్డు లౌలెట్రులున్నాయి.

బుడుగు ఇరుగు, పొరుగు ప్రవేటు మాష్టారు: వీడు మంచివాడు కాడు. అసలు ప్రవేటు మాష్టర్లు అందరూ ఇంతే. ఇప్పటికి వీడు పదోవాడు. ఒక్క డూ పకోడీలు తేడు. పెైగా లెక్కలు చేయమంటారు. చెవి మెలిపెడతారు.

రెండుజళ్ళ సీత : చాలామంది ఉన్నారు. ఒకోసారి ఒక జడ ముందుకీ, ఒక జడ వెనక్కీ వేసుకొని నడుస్తారు. ఇది చాలా ఇబ్బంది. అప్పుడు వాళ్ళు వస్తు న్నారో వెళ్తున్నారో ఎలా తెలుస్తుంది?
లావుపాటి పిన్నిగారు : అవిడకు పెద్ద జడ లేదు. అయినా పేరంటంలో పెద్ద జడ ఉంటుంది. అది నిజం జడ కాదనుకో. డేంజరు అంటే పిన్నిగారూ, మా బామ్మా పోట్లాడుకోవడం.
సీగాన పెసూనాంబ : బుడుగు గర్ల్‌ఫ్రెండ్‌

ఇంకా డికెష్టివ్‌, విగ్గు లేని యముడు, పిన్నిగారి మొగుడు, సుబ్బలక్ష్మి - ఇలా చాలా మందున్నారు.

ramana1‘ నా అంతవాడు నేను. నన్ను ఎవరూ కొట్టకూడదు. నేను నిఝంగా పెద్ద వాడినే అనుకో. ఐతే వాళ్ళే నన్ను కురక్రుంకా అంటారుగా. అందుకని కొట్ట కూడదు. సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే. వీటిని బాబాయిలాంటి కురవ్రాళ్ళు కాలుస్తారు. .. మరి నేను పెద్దవాడినిగా. అందుకనే కాలవను. నేను ఇంఖా పెద్దవాణ్ణయ్యాకా జెటకా బండియేనా రెైలింజనేనా తోలుతానుగా. అందుకని బీడీలు దాస్తాననుకో. అప్పుడు చెవులో పెట్టుకోవాలిగా. బీడీలు బామ్మ వత్తు ల పెట్టెలో దాస్తే భద్రంగా ఉంటాయి... అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడమీద గుచ్చి కాలుస్తారు. సిగరెట్లేమో నోట్లో గుచ్చి కాలుస్తారు.

* ప్రెవేటు చెప్పడం - లౌలెట్రు వ్రాసినపుడు రెండుజళ్ళ సీత నాన్న బాబాయికి ప్రెవేటు చెబుతాడు. ఒకోసారి నాన్న అమ్మకు ప్రెవేటు చెబుతాడు.* జాఠర్‌ ఢమాల్‌ - అంటే ఏంటో.* అంకెలు - ఒకటి, రెండు, ఫది, డెభ్బయ్యో, బోల్డన్నో* అనుభవం : టెంకిజెల్లలు, మొట ి్టకాయలు తినడం...బుడుగు భాష ప్రత్యేకమైనది. అది వ్యాకరణ పరిధికి అందదు. భాషలోని తియ్యదనం అంతా ఆ మాటల్లోనే ఉంది.

తన కాలంలోనే కాక తరువాత కాలం లో కూడా వస్తువరణంలో, భాష విష యంలో చేసిన ప్రయోగాలు ఇతర రచయి తలపెైన ప్రభావం కలిగించడమే కాక రెండు మూడు తరాల ప్రజల మనసులపెై ముళ్ళపూడి వెంకట రమణ చెరగని ముద్ర వేసుకున్నారు. తెలు గు సాహిత్యంలో ఆయన ప్రత్యేకమైన రచయితగా నిలి చిపోయారు. హాస్యరచనలలో ముళ్ళపూడి వెంకట రమణది ఫోర్జరీ చెయ్యలేని సంతకం, హాస్యరచనలో అనన్యం... అనితర సాధ్యం అతని మార్గం అని ఆంధ్ర పాఠక లోకం సగర్వంగా చెప్పుకునే మనసున్న మహాకవి ముళ్ళపూడి వెంకట రమణకి తెలుగు సాహితీలోకం యావత్తూ నివాళులర్పిస్తోంది. యాభెై సంవత్సరాలుగా బాపును అంటిపెట్టుకుని స్నేహమనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చారు వారిరువురూ...బాపూరమణీయం అనే పదం ఎంత అందంగా ఇమిడిపోయిందో...బాపూరమణలు కూడా అంతకన్నా ఎక్కువగానే చెలిమిబంధంతో ్జకలిసిపోయారు. ఇకపెై బాపు ఒంటరిగానే నెగ్గుకు రావాలి...రమణీయత కోల్పోయిన బాపు పక్కన ఇంకెవ్వరినీ ఊహించలేము...బాలకృష్ణతో తీయబోయే ‘శ్రీరామరాజ్యం’ ఈ జంటకు చివరి సినిమా. ఆ సినిమా పూర్తికాకుండానే రమణగారు తుదిశ్వాస విడిచారు.


హాస్య నవలలు, కథలు...
బుడుగు - చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన
ఋణానందలహరి (అప్పుల అప్పారావు- అప్పుల ప్రహసనం) విక్రమార్కుని మార్కు సింహాసనం - సినీ మాయాలోక చిత్ర విచిత్రం
గిరీశం లెక్చర్లు - సినిమాలపెై సెటైర్లు
రాజకీయ బేతాళ పంచవిశతి - రాజకీయ చదరంగం గురించి
ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం
ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే...అయితే ముళ్ళపూడి రచనలు పుస్త్తకాల రూపంగా కాక చెదురుమదురుగా పత్రికలలో వచ్చినవి కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. ఇవే కాక సినిమా కథలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారు 8 సంపుటాలుగా ప్రచురించారు. అవి
1. కథా రమణీయం -1 : సీతా కళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్‌, రాజకీయ బేతాళ పంచవింశతి, ఇతర కథలు
2. కథా రమణీయం - 2 : ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు
3. బాల రమణీయం : బుడుగు
4. కదంబ రమణీయం - 1 : నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, ఇతర రచనలు
5. కదంబ రమణీయం - 2 : గిరీశం లెక్చర్లు, కృష్ణ లీలలు, వ్యాసాలు, ఇతర రచనలు
6. సినీ రమణీయం - 1 : చలనచిత్ర ప్రముఖులపెై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపెై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు
7. సినీ రమణీయం - 2 : కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపెై వ్యాసాలు
8. అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109
9. ప్రస్తుతం’ కోతికొమ్మచ్చి’ పేరుతో తన జీవిత చరిత్ర లాంటిది స్వాతి వార పత్రికలో వ్రాస్తున్నారు.
ఇంకా ఇవిగాక ఇద్దరు మిత్రులు (వెండితెర నవల), తిరుప్పావెై దివ్య ప్రబంధం మేలుపలుకుల మేలుకొలుపులు, రమణీయ భాగవత కథలు.
రామాయణం (ముళ్ళపూడి, బాపు), శ్రీకృష్ణ లీలలు.

అమ్మ మాట వినకపోతే...
1945లో బాల పత్రికలో రమణ మొదటి కథ అమ్మ మాట వినకపోతే అచ్చయ్యింది. అందులోనే బాల శతకం పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే ఉదయభాను అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్‌గా కీలక బాధ్యత వహించారు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, దానితో వచ్చిన డబ్బులతో ఒక సైక్లోస్టైల్‌ మెషిన్‌ కొన్నారు. ఆ పత్రికకు రమణగారే ఎడిటర్‌. చిత్రకారుడు మాత్రం బాపు. ఆర్ధిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. 1954లో ఆంధ్ర పత్రిక డెైలీలో సబ్‌ ఎడిటర్‌గా చేరారు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే బుడుగు వ్రాశారు. దాదాపు ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు అని చెప్పవచ్చు.

బాపూ రమణీయం
బాపు అనగానే అందమైన బొమ్మలెలా గుర్తొస్తాయో, రమణ అనే పేరు కూడా జ్ఞప్తికి వస్తుంది. బాపు-రమణల స్నేహం అటువంటిది. బాపు బొమ్మల కొలువు పేర్చితే, ముళ్ళపూడి వెంకట రమణ ఆ బొమ్మల చేత అల్లరి చేయించి, మన ఇంట నవ్వుల పూవులు విరబూయించారు. బుడుగు గాడి అల్లరి, సీగాన పెసూనాంబ పాత్రలు పాఠకులు అంతలా దగ్గరయ్యారంటే రాసిన రమణదా గీసిన బాపుదా అంటే చెప్పడం చాలా కష్టం. ఈ మిత్రద్వయం తమ ప్రతిభతో తెలుగు చలనచిత్ర సీమకు ఆణిముత్యాలంటి చిత్రాలను అందించారు.

బాపు తెలుగు, హిందీ భాషల్లో 40 పెైగా చిత్రాలను రూపొందించారు. వీటిలో సాక్షి, బంగారు పిచ్చిక, బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, రామాంజనేయ యుద్దం, మంత్రి గారి వియ్యంకు డు, జాకీ, శ్రీరాజేశ్వరి వి లాస్‌ కాఫీ క్లబ్‌, శుభోదయం, ముత్యాలముగ్గు నుంచి పెళ్ళి పుస్త్తకం, మిస్టర్‌ పెళ్ళం వరకూ బాపు సినిమా లు రమణతో విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్నా యి. అందమైన తెలుగు వాకిళ్ళు, ఉయ్యాల బల్లలు, మెలిక ముగ్గులు. ఇలా ప్రతీ సన్ని వేశంలో తెలుగుద నం ఉట్టిపడుతుం ది. బాపు ఊహల కు రమణ తన సంభాషణా చాతు ర్యంతో ప్రాణం పోసేవారు. సీతా కళ్యాణం చిత్రంలో రామునికి ఒక్క సంభాషణ కూడా ఉండక పోవటం గమనార్హం. అలాగే, చారెడు-పిడికెడు-బారెడు అంటూ పెళ్ళిపుస్తకంలో దివ్యవాణి అందాన్ని, రాజేంద్ర ప్రసాద్‌ చేత తమాషాగా చెప్పించి, ఆ మాటల అర్ధాన్ని, ఒక పాటలో చెంపకు కన్నులు చారెడు-సన్నని నడుము పిడికెడు-దువ్వీ దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు... అంటూ పూరించారు.

ఇంకా, అపార్ధసారధమ్మా(పెళ్ళి పుస్తకం), మంగళాస్త్రాలు(మంగళసూత్రమన్నమాట...సుందరకాండ సినిమాలో) వంటి పదప్రయోగాలు నవ్విస్తాయి. బాపు చిత్రాలలో చెప్పుకోదగిన ప్రయోగాలు...ఎప్పుడు చూసినా ఇద్దరు నాయికలతో అడిపాడే శోభన్‌బాబు చేత, ఏక పత్నీవ్రతుడెైన రాముని పాత్ర వేయించటం(సంపూర్ణ రామయణం).అలాగే, వాణిశ్రీతో మేకప్‌ లేకుండా నటింప చేయ టం(గోరంత దీపం). సినిమాలే కాక, బాపు-రమణలు టి.వి సీరియళ్ళు కూడా చేశారు. ‘భాగవతం’ అందులో చాలా ప్రసిద్ధి చెందింది.

ప్రముఖ రచయితగా...
ముళ్ళపూడి వెంకటరమణ ప్రముఖ తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు అనేకం రాశారు. ముఖ్యంగా తన హాస్యరచనల ద్వారా సుప్రసిద్ధులయ్యారు. ఈయన వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం సంపాదించింది. ప్రఖ్యాత చిత్రకారుడెైన బాపు ఈయన కృషిలో సహచరుడెైనందున వీరి జంటను బాపు-రమణ జంటగా పేర్కొంటారు. బాపు మొట్టమొదటి సినిమా సాక్షి , బంగారు పిచ్చుక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్‌ పెళ్ళాం, రాధాగోపాలం వంటి మచ్చుక సినిమాలకు రచయితగా ముళ్లపూడివారు వ్యవహరించారు. 1995లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ నుండి రాజాలక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకున్నారు.

ముళ్ళపూడి ’చిత్ర‘ మణి మకుటాలు
- సాక్షి
- బంగారు పిచ్చుక
- ముత్యాల ముగ్గు
- గోరంత దీపం
- మనవూరి పాండవులు
- రాజాధిరాజు
- పెళ్ళి పుస్తకం
- మిష్టర్‌ పెళ్ళాం
- రాధాగోపాలం
- బుద్ధిమంతుడు,
- సంపూర్ణ రామాయణం,
- సీతా కళ్యాణం

- నండూరి రవిశంకర్‌
మాటల మాంత్రికుడు మరికలేడు !
v-ramanaబాపు కుడిభుజం, ‘బుడుగు’ సృష్టికర్త, ప్రఖ్యాత రచయిత ముళ్లపూడి వెంకటరమణ చెన్నయిలో నిన్న ఉదయం మరణించారు. ఆయన వయసు 80 సంరాలు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఈయన జూన్‌ 28, 1931లో జన్మించారు. ‘ఆంధ్రపత్రిక’ సబ్‌ ఎడిటర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించడానికి ముందే ‘ఉదయభాను’ పేరుతో ఒక పత్రికను ఈయన స్వయంగా నిర్వహించడం విశేషం. ‘దాగుడుమూతలు’, ‘రక్తసంబంధం’, ‘భార్యాభర్తలు’, ‘మూగమనసులు’ వంటి చిత్రాలకు సంభాషణలు అందించిన ముళ్లపూడి.. బాపు దర్శకత్వంలో రూపొందిన అన్ని చిత్రాలకూ రచన చేసారు. ముళ్లపూడి రచనలకు బాపు బొమ్మలు గీస్తే.. బాపు చిత్రాలకు మాటలు నేర్పే బాధ్యత ముళ్లపూడిదే.

స్వచ్ఛమైన స్నేహానికి బాపు-రమణలను ప్రతీకలుగా చెబుతారనే విషయం తెలిసిందే. బాలకృష్ణ-నయనతార జంటగా బాపు దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీరామరాజ్యం’ ముళ్లపూడి చివరి చిత్రం కానుంది. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘ముత్యాలముగ్గు’ చిత్రంలో ముళ్లపూడి రాసిన డెైలాగులు ఎంత పాపులరో చెప్పాల్సినవసరం లేదు. ‘అందాలరాముడు’, ‘సాక్షి’, ‘సంపూర్ణరామాయణం’, ‘పెళ్లి పుస్తకం’, ‘మిస్టర్‌ పెళ్లాం’ వంటి చిత్రాలన్నిటికీ సంభాషణలం దించింది ముళ్లపూడి కలమే.

ఎన్టీఆర్‌తో ‘నా అల్లుడు’, రాజీవ్‌ కనకాలతో ‘విశాఖ ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ముళ్లపూడి వర.. ముళ్లపూడి వెంకటరమణ తనయుడే.

ముళ్లపూడి మృతి పట్ల తెలుగు చలనచిత్రపరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఒక గొప్ప రచయితను కోల్పోయామని పేర్కొంది.


Tuesday, January 12, 2010

బాపు రమణీయం * మూగబోయిన 'ముత్యాల' మాట * నవ్వుల కలం ఆగింది

తెలుగు చిత్రపరిశ్రమ మరో ప్రతిభావంతుణ్ణి కోల్పోయింది. ముళ్లపూడి వెంకటరమణ మరిలేరు అనే విషయం సాహితీ ప్రియులకే కాదు సామాన్య ప్రేక్షకులచేత కూడా కంటతడి పెట్టిస్తుంది. మూసకట్టు ఒరవడిని పక్కన పెట్టి కొత్తరకంగా కథలు అవి రాసేసిన రమణని పట్టుకుని, పనిగట్టుకుని సినిమారంగానికి తీసుకువచ్చేశారు కొంత మంది నిర్మాతలు. సినిమా అంటే దృశ్యప్రధానం కానీ శ్రవణ ప్రధానం కాదని నమ్మడమే కాదు అక్షరాలా ఆచరించి చూపారు. సినిమా షూటింగ్‌కు ముందే పూర్తి స్క్రిప్ట్ తయారు చేయడం రమణకి అలవాటు. సొంత సినిమా అయినా, బయట నిర్మాత సినిమా అయినా అదే పద్దతి.

సొంత సినిమా నిర్మాణసమయంలో ప్రొడక్షన్, బిజినెస్ చూడాల్సి వస్తుంది కనుక ముందే స్క్రిప్ట్ తయారు చేసేవారు. ఒకసారి రాసిన తర్వాత షూటింగ్ స్పాట్‌లో దాన్ని మార్చే అవసరం వచ్చేది కాదు. బయట చిత్రాలకు రాస్తున్నప్పుడు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'శ్రీరామరాజ్యం' సినిమా స్క్రిప్ట్ కూడా నిర్మాతకు ముందే అందచేశారు రమణ. విజువల్‌గా, అందంగా ఎలా చెప్పడం అన్నది ఊహించి సంభాషణలు రాసేవారు.

కథకుడిగా, విమర్శకుడిగా, వ్యాసకర్తగా, అనువాదకర్తగా రమణ తన రచనాసామర్ధ్యాన్ని ప్రదర్శించినా ఆయన పేరు ఇప్పటికీ జనం నోళ్లలో నానడానికి కారణం సినిమాలే అని చెప్పాలి. వెకిలితనమే హాస్యంగా చెలామణి అయినరోజుల్లో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన కలం రమణది. ఆయన హాస్యం పన్నీ రు చిలకరించినట్లుగా ఉంటుంది. ఇక వ్యంగమైతే చురుక్కుమనిపిస్తుంది. సినీరంగంలోకి అడుగుపెట్టకముందు తెలుగు, హిందీ, ఆంగ్ల చిత్రాల సమీక్షకుడిగా ఒక చరిత్ర సృష్టించారు. సినిమా తీసినవారి గతచరిత్ర ఎంత ఘనంగా ఉన్నా నిర్భయంగా విమర్శిస్తూ, తమాషాగా చురకలు వేస్తూ సమీక్షలతో పాఠకులకు చేరువయ్యారు.

ఇక సినీ రచయితగా రమణ సృష్టించిన పాత్రలు, మాటలు విలక్షణీయమైనవి. 'మడిసన్నాక కూసింత కలాపోసణుండాల, ఊరికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది' అని 'ముత్యాలముగ్గు' చిత్రంలో కంట్రాక్టర్‌తో పలికించిన మాట తెలుగు సినిమా ఉన్నంతవరకూ ప్రతి ఒక్కరికీ గుర్తుంటుంది. సినిమా డైలాగులు ఓ రికార్డుగా రావడమన్నది ఈ సినిమాతోనే మొదలైంది. అలాగే 'గోరంతదీపం' చిత్రంలో కూతురు అత్తవారింటికి వెళుతుంటే తండ్రి చెబుతాడు ' నువ్వు హాయిగా, సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్లను తలుచుకో.. చూడ్డానికి రా.. ఓడిపోతున్నప్పుడు , కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు. నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి. నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి' అని. అలాగే 'గుడిగంటలు' చిత్రంలో మరో మంచి డైలాగు ఉంది.

'పెదవుల మీది చిరునవ్వు అల్పమైన సుఖానికి, సంతోషానికి పుడుతుంది. ఇట్టే చెరిగిపోతుంది. ఈనాడు మనసారా మీకు సేవ చేయడం వల్ల కలిగే ఆనందం గాఢమైనది. అది హృదయంలో పుడుతుంది. అక్కడే ఉంటుంది. పెదవుల దాకా రాదు'. రమణ తొలి చిత్రం 'దాగుడుమూతలు' అయినా విడుదలైన తొలి సినిమా మాత్రం 'రక్తసంబంధం'. పుస్తకజ్ఞానం తప్ప ప్రపంచజ్ఞానం తెలియని వాళ్లు ఎలా మాట్లాడతారో 'దాగుడుమూతలు' చిత్రంలో పద్మనాభం పాత్రద్వారా చెప్పించారు. 'తాతయ్యకు బోల్డు ఆస్తి ఉండును. దానిని వాళ్లు మనుమలకు ఇచ్చేదరు. అంతవరకూ మనము అమ్మడిని పెళ్లి చేసుకోరాదు అని అమ్మ చెప్పును'... ఈ డైలాగులన్నీ జీవనసత్యాలే. అలాగే 'భక్త కన్నప్ప' సినిమాలో మరో డైలాగు ఉంది... ' శివుని మూడో కంట భగ్గుమనే మంటా ఉంది, ఓదార్చే వెన్నెలా ఉంది.

అసలు మూడో కన్ను శివుడికే కాదు జీవులందరికీ ఉంది. మూడో కన్నంటే లో వెలుగు. మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో. ఎదుటివాడి గొప్పనే తెలుసుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది దీపం పెద్దదవుతుంది. దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను. ఆ కంటి సిరి నీ కండసిరికన్నా గొప్పది...' ఈ డైలాగు ఆ చిత్రంలోని ఆ పాత్రకే కాదు ఎప్పుడైనా ఎవరికైనా వర్తిస్తుంది.

అదే విధంగా 'వాడికి డబ్బు చేసింది', 'ఆశ్చర్యపడి పోయి లేచాను', 'నీకు ధనబద్ధకం' 'దాఋణం', ' తుత్తి' 'ఆమ్యాయ్యా', 'తీతా'(తీసేసిని తాసిల్దార్) వంటి కొత్త పదాలను సృష్టించిన ఘనత రమణదే. నవ్వితే తమ స్టేటస్‌కి భంగం అనుకునే మేధావులను సైతం ఎలాంటి భేషజాలూ లేకుండా నవ్వించిన కలం ఆయనది. తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్రకథానాయకులందరి చిత్రాలకు రచన చేశారు రమణ. ముఖ్యంగా ఎన్టీఆర్, ఎఎన్నార్‌తో ఆయనకు అనుబంధం ఎక్కువ. అక్కినేని జీవిత కథను 'కథానాయకుడి కథ' పేరుతో పుస్తకరూపంలో తెచ్చారు రమణ.

అలాగే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాపు,రమణతో వీడియో పాఠాలు తయారు చేయించారు. అలాగే కృష్ణ నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' చిత్రానికి రమణే రచయిత. హీరోగా కృష్ణ ఎదుగుతున్న దశలో తమ తొలి సినిమా 'సాక్షి'లో మంచి అవకాశం కల్పించి ఆయన కెరీర్‌కు పటిష్టమైన పునాది ఏర్పరచారు. అదే విధంగా శోభన్‌బాబుకు 'సంపూర్ణరామాయణం' చిత్రాన్ని, కృష్ణంరాజుకు 'భక్త కన్నప్ప' చిత్రాన్ని అందించి వారి స్థాయిని పెంచారు బాపు, రమణ.

బాపు బొమ్మకి మాటలు నేర్పిన వాడు రమణ అయితే, రమన మాటలకు రూపం ఇచ్చిన వ్యక్తి బాపు. బాల్యంలో ఏర్పడిన వీరి స్నేహబంధం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. స్నేహం అనేది వ్యాపారాత్మకం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి అతీతంగా ఉంటూ తమ స్నేహం గురించి వారు చెప్పుకోకుండా, ఇతరులు చెప్పుకునే స్థాయిలో వారి స్నేహబంధం ఉంది. బాపు బొమ్మయితే, రమణ బొరుసు. మరి అటువంటి ప్రాణస్నేహితుణ్ణి కోల్పోయిన బాపుని ఓదార్చడం ఎవరి తరం!

నిన్న 'పాట'...నేడు 'మాట'...

తెలుగుజాతి గత ఏడాది 'పాట'ను కోల్పోయింది. నేడు 'మాట'ను కోల్పోయింది. నెలరోజుల క్రితం సంపాదక ప్రముఖుడ్ని (చందూర్) కోల్పోయింది. సాహిత్యంలో, మరీ ముఖ్యంగా చలనచిత్రసీమలో సునిశిత హాస్యాన్ని అసమానంగా పండించిన మితభాషి ముళ్లపూడి వెంకటరమణ సాహితీ ప్రియులకు అమిత బాధను మిగిల్చి వెళ్లిపోయారు.'రాత-గీత' ద్వయంలో (బాపు-రమణ)'రాత' నిష్క్రమించింది. బుడతజంట 'బుడుగు-సిీగాన పెసూనాంబ', యువజంట 'రాధా-గోపాళం' 'పక్కింటి లావుపాటి పిన్నిగారు, 'ఆవిడ మొగుడు', రెండుజెళ్లసీత, కలాపోసనగల మర్డర్ల కాంట్రాక్టర్, ఆయన సెగట్రీ, అద్దె భజంత్రీలు, నిత్యపెళ్లికొడుకు, అప్పుల అప్పారావు, 'తీతా', దొరవారి సహాయకుడు'కన్నప్ప'ఇలా ఒకరేమిటి...ఎన్నెన్నో పాత్రలతో పాటు తెలుగుపాఠక, ప్రేక్షకజనం.. మరీ ముఖ్యంగా హాస్యప్రియులు కలతచెందారు.

నీవుంటే వేరే కనులెందుకు..

'నీవుంటే వేరే కనులెందుకు..నీ కంటే వేరే బ్రతుకెందుకు నీ బాట లోని అడుగులు నావే' అంటూ స్నేహతత్వాన్ని ఆవిష్కరించిన ప్రాణస్నేహితులు. కొన్ని జంటలను వేర్వేరుగా చూడలే(రు)ము. ఉదాహరణకు, తెలుగు అవధాన ప్రక్రియకు వెలుగురేఖలు తిరుపతి వెంకటకవులను స్నేహానికి చిరునామాగా చెబుతారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి అస్తమించినా (1919) మిత్రులు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి తుది వరకు (1950) తమ సాహితీ వ్యాసంగాన్ని 'జంటకవులు' పేరుతోనే సాగించి మైత్రీబం«ధాన్ని కొనసాగించారు. ఇక తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఎన్ని జంటలు పని చేసినా తొలితరంలో 'నాగిరెడ్డి-చక్రపాణి' మలితరంలో 'బాపు-రమణ' చెప్పదగిన జంటలు. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా' అన్న వేమన మాట ఈ 'స్నేహజంట'కు అమ్మ పాలంత స్వచ్ఛంగా పొసగుతుంది.

ఇది మెచ్చుకోలు కాదు.'అచ్చకోలు'.రెండు శరీరాలకు ఒకే ఆత్మ 'బాపు- రమణ' అంటారు అభిమానులు. 'ఒకే ఇల్లు,ఒకే ప్రాణం, ఒకే వ్యాపకం, బొమ్మా-బొరుసు, తోడు-నీడ... ఇలా అన్నీనూ! అందుకే 'బాపురే(ర)మణ' అన్నారు సినారె. అభిప్రాయభేదాలు అంటూ ఉంటే (వృత్తిపరంగా) అవి అంతవరకేనట! 'స్నేహం చేసే ముందు ఆలోచించు. ఆ తరువాత కడదాక కొనసాగించు' అన్న సూక్తి వీరిముందు వెలవెల పోవలసిందే. ఎందుకంటే వీరిది 'కాంట్రాక్టు/సిఫారుసు/మొహమాటం/అవసరాల'స్నేహం కాదు కాబట్టి.

'సిఫార్సులతో కాపురాలు చక్కబడవన్న' ముత్యాలముగ్గు నాయిక మాటలు స్నేహానికీ వర్తిస్తాయని రుజువు చేసింది ఈ జంట. ఇదే విషయాన్ని ముళ్లపూడి వారితో ప్రస్తావిస్తే, భార్యాభర్తల మధ్యకాని, స్నేహితుల మధ్య కానీ నమ్మకం ముఖ్యం అనేవారు. ఆ విషయాన్నే ఆయన సినిమా సంభాషణల్లో ఆవిష్కరించారు. నచ్చని వ్యక్తుల గురించి వ్యాఖ్యానించడం కంటే మౌనంగా ఉండడం ఉత్తమం అనీ మరీ చెప్పవలసి వస్తే వారి పేర్లు ప్రస్తావనకు రాకుండా క్లుప్తంగా సైగలతో చెప్పడం ఆయన ప్రత్యేకత. అదే సమయంలో నచ్చిన వ్యక్తి గురించి, నచ్చిన రచన గురించి ఢంకా బజాయించి కితాబు ఇచ్చేవారు. పూర్వకవులన్నా, వారి రచనలన్నా మక్కువ ఎక్కువ.

వారి పాత్రలకు కొనసాగింపునిచ్చి చిరస్మరణీయం చేసిన ఘట్టాలూ ఉన్నాయి. గురజాడ వారి అపురూప సృష్ట 'గిరీశం'. దానిని అందిపుచ్చుకున్న ముళ్లపూడి ఆ పాత్రతో ఉపన్యాసాలు (లెక్చర్లు)ఇప్పించారు. మొక్కపాటి 'బారిస్టర్ పార్వతీశం', చిలకమర్తి వారి 'జంఘాలశాస్త్రి', మునిమాణ్యిం 'కాంతం' పాత్రల మాదిరిగానే ముళ్లపూడి అనేక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అవన్నీ మధ్యతరగతి జీవితాల నుంచిపుట్టినవే.

మాటల బ్రహ్మ
విత్తు ముందా చెట్టు ముందా అనే సామెతకు ఈ ఇద్దరిమిత్రుల భావనలకు సామ్యం ఉంది. 'వాడికి (బాపు) కాంటెంపరరీగా ఉండడం మన అదృష్టం' అని రమణ అంటే 'నేనూ అంతే' అనే భావం వ్యక్తపరుస్తారు బాపు. అందుకే 'బాపు రమణీయం.' తమను మహానుభావులు అని ఎవరైనా సంబోధిస్తే 'మహా'కాదు..'ఉత్తభావుణ్నే' అని చెప్పుకున్న చమత్కారి. కంచర్లగోపన్న ఉరఫ్ రామదాసు రాముల వారి ఆలయాన్ని 'అప్పు'చేసి కట్టించారేమోనని హాస్యమాడారు. 'విష్ణుమూర్తులోరు స్వయంగా ప్రత్యక్షమై భక్తా ఏం కావాలో కోరుకోమంటే.. ముందు మా మేనమావ సెవిలో ఎంట్రుకలు మొలిపించు. తతిమ్మాది నేజూసుకుంటా' అని వరమడిగేసి, 'చెవి వెంట్రుకల' వెనుకున్న రహస్యం ఏమిటో ప్రేక్షకులకు వదిలేశారు. ఇలాంటి చమత్కార కలానికి హాస్యం 'రుణపడిలేదూ!'

గుండె గొంతుకలోన...

తక్కువ అక్షరాల్లో ఎక్కువ అర్థం చెప్పాలన్న సత్యం ముళ్లపూడి శైలిలోను, ఆయన వ్యక్తిత్వంలోనూ కనిపిస్తుంది. .తక్కువ మాట్లాడు ఎక్కువ పనిచేయి' అనే సూక్తో, 'గంగిగోవుపాలు గరిటడైనను చాలు' అనే శతకకర్త మాట అందుకు స్ఫూర్తో తెలియదు. ఆచరణలో మాత్రం అది స్పష్టమయ్యేది. ఇటీవల రవీంద్రభారతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న సందర్భంలో ఆయన స్పందనే అందుకు తాజా ఉదాహరణ.

'ఆనాడు ఆయన (ఎన్టీఆర్) ఆదరించారు-ఇప్పుడు మీరు (లక్ష్మీపార్వతి) ఆదరించారు' అని ఒకే ముక్కతో ధన్యవాదాలు చెప్పారు. అవునూ! ఇంత 'మితభాషు'లు అన్ని కళాఖండాలు ఎలా సృష్టించారన్నది అభిమానుల సందేహం. ఫలాని వారి మరణం తీరనిలోటు అని వినిపించే మాటల్లో ఎంత నిజమో కానీ 'ముళ్లపూడి' నిష్క్రమణ విషయంలో మాత్రం అది నిఖార్సైనదే. 'గుండె గొంతుకలోన కొట్లాడుతాది' అన్న నండూరి వారి మాటకు అర్థం ఈ విషాదవేళ స్ఫురిస్తోంది. 

నవ్వుల కలం ఆగింది
ముళ్లపూడి కన్నుమూత

ఫ్లూ జ్వరంలో మృతి
ఆఖరి క్షణాలూ బాపూ చెంతే
తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి
శుక్రవారం చెన్నైలో అంత్యక్రియలు
చెన్నై, ఫిబ్రవరి 24 : తెలుగు తెరను గోదారి నీళ్లతో అభిషేకించిన నిఖార్సైన తెలుగోడు మరిలేరు. తెలుగుకు గుడి కట్టిన నవ్వుల కలం ఆగిపోయింది. తెలుగు వారి బాల్యాలకు 'బుడుగు'ను కానుకగా ఇచ్చిన నిత్య బాలకుడు ముఖం చాటేశారు. 'కోతి కొమ్మచ్చి' ఆడుతూనే, అందరినీ ఆదమరిపించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సుప్రసిద్ధ రచయిత, సీనియర్ పాత్రికేయుడు, స్నేహ బంధానికి పర్యాయపదం ముళ్లపూడి వెంకట రమణ చెన్నైలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఫ్లూ జ్వరంతో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ప్రాణ మిత్రుడు, ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపూ ఆయన పక్కనే ఉన్నారు. 80 ఏళ్ల ముళ్లపూడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ముళ్లపూడి వర సినీ దర్శకుడిగా పరిశ్రమలో స్థిరపడ్డారు. కుమార్తె అమెరికాలో ఉన్నారు.

ఆమె శుక్రవారం వచ్చే అవకాశముందని, ఆమె రాగానే చెన్నైలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. ముళ్లపూడి మృతి వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, తాతినేని రామారావు, సినీ విమర్శకుడు వీఏకే రంగారావు, గీత రచయిత భువనచంద్ర, రచయిత్రి మాలతీచందూర్, నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం వారిలో ఉన్నారు.

కష్టాల కాపురం

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 1931 జూన్ 28న ముళ్లపూడి వెంకటరమణ జన్మించారు. తొమ్మిదేళ్లకే తండ్రి మరణించారు. ఇల్లు గడవడం కష్టమై.. కుటుంబంతో మద్రాస్ చేరుకున్నారు. తొలుత ఆంధ్ర మహిళాసభలో పని చేయడంతో పాటు పలు కష్టలు పడ్డారు. 5,6 తరగతులను ఏలూరులో, 7,8 తరగతులను రాజమండ్రిలోని వీరేశలింగం స్కూల్లో, ఎస్ఎస్ఎల్‌సీని మద్రాస్‌లోని పీఎస్ స్కూల్లో పూర్తి చేశారు. అక్కడే బాపూతో పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ కలసి 'ఉదయభాను' రాతపత్రికను ప్రారంభించారు. రమణ రాస్తే, బాపూ బొమ్మలు గీసేవారు. 1945లో రమణ తొలి కథ 'అమ్మ మాట వినకపోతే..' 'బాల' మాసపత్రికలో ప్రచురితమైంది. 1954లో ముళ్లపూడి ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరారు. అనంతరం వారపత్రికకు మారి, సినిమా విభాగాన్ని పర్యవేక్షించేవారు. ఇదే సినిమా వైపు మరలడానికి కారణమైంది.

ఆయన కథ అందించిన తొలిచిత్రం 'రక్తసంబంధం'. మూగమనసులు, దాగుడుమూతలు, సాక్షి, బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప, రాధాకళ్యాణం, మంత్రిగారి వియ్యంకుడు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీనాధ కవి సార్వభౌముడు తదితర 39 సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు అందించారు. బాపూ దర్శకత్వంలోనే ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. ఆయన కథ రాస్తే, బాపూ దృశ్య చిత్రీకరణ చేసేవారు. చిత్రకల్పన బ్యానర్ పేరిట సొంత ప్రొడక్షన్ ప్రారంభించి, అందాల రాముడు, సీతాకళ్యాణం తదితర నాలుగు చిత్రాలను ముళ్లపూడి నిర్మించారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "శ్రీరామరాజ్యం'' ముళ్లపూడి చివరి సినిమా.

చిరంజీవి బుడుగు: తానున్నా లేకున్నా తన 'బుడుగు' చిరకాలం వుంటాడని ముళ్లపూడి ఓ ఇంటర్వ్యూలో 'ఆన్‌లైన్'తో అన్నారు. ఆయన సృష్టించిన బుడుగు పాత్ర తెలుగునాట అంత ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. నిజానికి ముళ్లపూడిని ఆయన తల్లి బుడుగు అని పిలిచేవారు. ఆమెపై ప్రేమతోనే ఆ పాత్రను సృష్టించారు. ముళ్లపూడికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు నంది అవార్డులను అందజేసింది. ప్రతిష్ఠాత్మమైన రఘుపతి వెంకయ్య అవార్డును బాపూతో కలసి పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1995లో రాజలక్ష్మి పురస్కారాలను అందుకున్నారు. ఎస్వీ, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీలు ముళ్లపూడికి గౌరవ డాక్టరేట్ అందజేశాయి.

ప్రముఖుల సంతాపం: ముళ్లపూడి వెంకటరమణ మృతికి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వెలిబుచ్చారు. బాపు-రమణల కలయికలో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలు వచ్చేవని, ముళ్లపూడి మరణంతో ఒక అధ్యాయం ముగిసిందని సీఎం అన్నారు. ముళ్లపూడి హఠాన్మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వెలిబుచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. ఎన్టీఆర్‌తో శ్రీనాథ కవిసార్వభౌమ సినిమాకు పనిచేశారని, బాలకృష్ణతో శ్రీరామరాజ్యం సినిమాకు పనిచేస్తున్నారని గుర్తు చేసుకున్నారు.

ఆయన మృతి తెలుగు చిత్రరంగానికి తీరని లోటన్నారు. ముళ్లపూడి మృతికి మాజీ సీఎం రోశయ్య విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముళ్లపూడి రాసిన 'బుడుగు' రచన, తెలుగువారికి ప్రత్యేకమైందని పీఆర్పీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాపు-ముళ్లపూడి సినిమాల్లో సంభాషణలు, బొమ్మలు తెలుగు జాతి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఇందుకు ముత్యాలముగ్గు ఉదాహరణ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన రచనలతో ఆబాలగోపాలాన్ని అలరించిన రచయితల్లో ముళ్లపూడి ఒకరని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.

ప్రాథమిక విద్యాబోధనను బాగుచేసేందుకు ఆయన ఎంతో తపనతో కృషి చేసినా, పాలకులు వినియోగించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని కృత్రిమత్వాన్ని, మనుషుల మనస్తత్వాల్లోని వికారాల్ని సరిచేసుకునేందుకు వెంకటరమణ సృజనాత్మక రచనలు చేశారన్నారు. ఆయన 'బుడుగు' నేటికీ పెద్ద బాలశిక్షలాగా విదేశాల్లోని తెలుగువారు భద్రపరుచుకుంటున్నారన్నారు. ముళ్లపూడి కుటుంబ సభ్యులకు, బాపుకు తన సంతాపాన్ని తెలిపారు. సృజనాత్మక చిత్రాలకు మాటలు రాయడంలో ముళ్లపూడి దిట్ట అని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులి సాంబశివరావు, పల్లె నర్సింహులు అన్నారు.
Click Here!