
రామచరితను వెండితెరకు ఎక్కించడంలో బాపు రమణలది మొదట్నించి ప్రత్యేక శైలి. బహుశా రామాయణాన్ని అన్ని కోణాల్లో వాడుకున్న దర్శక రచయితలు మరొకరు లేరేమో! సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం వారు నేరుగా తీసిన పౌరాణిక చిత్రాలు కాగా ... ముత్యాలముగ్గు, కలియుగ రావణాసురుడు, రాంబంటు, అందాల రాముడు, సుందరకాండలు ఆ గాథను పోలిన సాంఘిక చిత్రాలు. రామభక్తుడైన త్యాగరాజస్వామి కీర్తనలతో అలరించిన మరో చిత్రం 'త్యాగయ్య'. ఇంకా నిర్మాణంలో ఉన్న చిత్రం శ్రీరామరాజ్యం. బాపు రమణలు రామాయణాన్ని ఎంతో ఇష్టంగా, ఒక రమణీయ శ్రవ్య, దృశ్య కావ్యంగా మలచి ప్రేక్షకులకు అందించిన తీరుని అవలోకించే కథనమే ఈ స్టోరీ.

రామాయణాన్ని 'పాఠ్యే గేయేచ మధురమ్' అన్నారు. అంటే రామాయణం పాడుకోవడానికి, చదువుకోవడానికి కూడా అనుకూలమైనదన్నమాట. కాబట్టే రామతారక మంత్ర మహత్యాన్ని కృతులుగా గానం చేసిన త్యాగరాజస్వామి వంటి వాగ్గేయకారులున్నారు. నృత్యంలో, అభినయంలో రామాయణతత్వాన్ని ఆవిష్కరింపజేసిన మహానృత్య కళాకారులున్నారు. చిత్రకళ ద్వారా శ్రీరాముడి రూపాన్ని శ్రీ రామాయణ వైశిష్ట్యాన్ని కన్నులకు కట్టినట్టుగా చిత్రీకరించిన ప్రముఖ చిత్రకారులున్నారు. ఇలా ప్రతి కళలోనూ యుగయుగాలుగా రామనామం, రామతత్వం దర్శనమిస్తూ ఉంది. ఆధునిక యుగంలో సంగీత సాహిత్య నృత్య చిత్రకళలన్నీ కలిసిన సినిమా అనే సమాహార కళారూపంలో ఇది మనకు అద్భుతంగా రససిద్ధి కలిగిస్తుంది. దీని వలన ప్రజలకి ఏక కాలంలో శ్రోతలుగా, ప్రేక్షకులుగా రామతత్వాన్ని ఆస్వాదించే అవకాశం కలిగింది. ఈ మాధ్యమాన్ని బాపు రమణలు అద్భుతంగా ఉపయోగించుకుని రామాయణ తత్వాన్ని, రామ నామ వైశిష్ట్యాన్ని మనకి అందించారు.
ఒక వ్యక్తి అత్యుత్తముడిగా, ధర్మాత్ముడిగా జీవించాలంటే మానవుడిలా జీవించిన శ్రీరాముడిలా జీవించాలన్నది ఆర్యోక్తి. అలాగే రామాయణంలోని ప్రతి పాత్ర మనకి ఒక్కొక్క ధర్మాన్ని ఉపదేశిస్తుంది. వారందరూ తమ జీవితాల్లో తమ స్వధర్మాలని ఆచరించారు. కాబట్టే రామాయణంపై అన్ని కాలాల్లోను అంత ఆకర్షణ ఏర్పడింది. రామాయణ తత్వాన్ని బాపు రమణలు ఔపోసన పట్టారనడానికి వారి చిత్రాలే గొప్ప ప్రతీకలు. ప్రతి చిత్రంలో శ్రీరాముని గుణసంపద, రామాయణ ప్రతిపాదిత ధర్మం కనిపిస్తుంది.
బాపు రమణలు నేరుగా తీసిన రామాయణాలు మూడు- సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం. పరోక్షంగా రామాయణ తత్వాన్ని ప్రతిబింబించే సినిమాలు కూడా చాలా తీశారు వాళ్లు. త్యాగయ్య, ముత్యాల ముగ్గు, అందాల రాముడు, రాంబంటు మొదలైనవి. తెలుగు సినిమాల్లో రామాయణం ఇతివృత్తంగా అనేక సినిమాలు ఉన్నప్పటికీ, సంపూర్ణ రామాయణమే రామాయణ ప్రధాన కథాంశాన్నంతటినీ ప్రదర్శిస్తుంది. ఆ రోజుల్లో ఈ సినిమా తీయడం గొప్ప సాహసం కూడా. ఎన్.టి. రామారావు శ్రీరాముడిగా నటిస్తున్న రోజుల్లో మరొకరు రామ పాత్ర వేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆరుద్ర వంటి కమ్యూనిస్టులు రాముడి మీద పాటలు రాయడమేమిటని కొందరు ముందే విమర్శలతో సిద్ధమైపోయారు.
ప్రేక్షకుడికి వైకుంఠ స్పర్శ

రామాయణంలోని బాలకాండని సంపూర్ణ రామాయణంలో సంక్షిప్తంగాను, సీతా కళ్యాణంలో పరిపూర్ణంగాను బాపు రమణలు చిత్రీకరించారు. రామాయణంలో శ్రీరామ పాత్ర కావ్యమంతా కనిపిస్తే సీత పాత్ర అంతర్లీనంగా దృశ్యాదృశ్యంగా ఉంటుంది. బాపు రమణలు శ్రవ్య కావ్యాన్ని దృశ్య కావ్యంగా మలచడంలో సీతాకళ్యాణం సినిమాకి ఆ పేరు ద్వారా వాల్మీకి హృదయ భావన, రామాయణానికి మరో పేరు అయిన సీతాయాశ్చరితం అనే సత్యాన్ని స్ఫురింపజేశారు. దీనికి ఆవిష్కరణగా ఈ సినిమాలో సీతా మనోభావ రూపకంగా రామాయణం దర్శించబడటం ఒక విశేషం. సంపూర్ణ రామాయణంలో చంద్రకళ, శోభన్‌బాబులు నటిస్తే, సీతాకళ్యాణంలో రవి, జయప్రదలు నటించి పాత్ర స్వభావాలను అత్యంత ప్రతిభావంతంగా పోషించారు.
... అందుకోగలిగినవారికే పూర్తి రసానందం

సినిమాల్లో చూపలేనివి టీవీలో చూపించారు

మహాశక్తివంతులైనా, ప్రకృతి శక్తులని వశం చేసుకోగలిగినా, భక్తాగ్రేసరులైనా, సమస్త శత్రువులను జయించిన వారైనా అహంకారమనే అంతరంగ శత్రువుని జయించలేకపోతే సర్వం వృధా, నాశనం తప్పదనే ఆధ్యాత్మిక సత్యాన్ని రెండు రామాయణాల్లోనూ శ్రీమహావిష్ణువు రావణాసురుడిని ఉద్దేశించి పలికిన వాక్యాలు. ఈ అహంకారానికి మద మాత్సర్యాలు తోడయితే విద్య వినయం బుద్ధి తపస్సు దగ్ధమైపోతాయని విష్ణుమూర్తి హెచ్చరిస్తాడు. మహాకావ్యాలు, ఉపనిషత్తులు, ధర్మ శాస్త్రాలు స్వయంగా చదివి అర్థం చేసుకోలేని వారికి ఈ సినిమాలు గొప్పగా ధర్మప్రబోధం చేస్తాయి. శ్రీరామ జననాన్ని ఆవిష్కరింపజేసే సన్నివేశాల్లో భారీ సెట్టింగులు మనలను త్రేతాయుగానికి తీసుకువెళతాయి. ఇక్ష్వాకు వంశం అంతటినీ వారి కీర్తి వైభవాలతో సహా ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం వారందరినీ అత్యంత రమణీయ శిల్పాలుగా దశరథ రాజ మందిరంలో నిలుపుతాడు బాపు. సంతానం కోసం అలమటించి ఆవేదన పడేటప్పుడు, శ్రీరాముడికి తమ వంశ ప్రతిష్ఠలు బోధించేటప్పుడు దశరథుడి నోట వీరి ప్రస్తావన వినిపిస్తాడు. ఇది మహా కావ్య రచనా లక్షణం. 'సీతాకళ్యాణం'లో పరమశివుడు తన అంశతో హనుమని ప్రభవింపజేయడం ఒక ఆహ్లాదకర దృశ్యం. ఋగ్వేద మంత్రాలతో సాగే యజ్ఞ యాగాదుల్లో, పుత్ర కామేష్టి చిత్రీకరించబడింది. శంఖచక్రగదాపద్మ సహితుడై శ్రీమన్నారాయణుడు భువిపై అవతరిస్తాడు. శ్రీహరి ఇంతకుముందు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ అవతారాల్లో లక్ష్మి సహితంగా అవతరించలేదు. తొలిసారిగా నాతో దిగివచ్చి ధర్మ సంస్థాపన చేయమని శ్రీహరి ఈ అవతారంలోనే లక్ష్మీదేవిని కోరతాడు.
శ్రీరామచంద్రుడి బాల్యాన్ని సీతాకళ్యాణం, సంపూర్ణ రామాయణంతో పాటు ఈ టి.వి. భాగవతంలోని రామాయణంలో కూడా చాలా రసవత్తరంగా చిత్రీకరించారు. ప్రత్యేకించి సినిమాల్లో చూపలేకపోయిన రామాయణ సన్నివేశాలని బాపు ఈ టి.వి. భాగవతంలో పది గంటలకు పైగా నిడివితో చిత్రీకరించారు. శ్రీరాముడిని క్షణమైనా విడలేని దశరథుడి పితృహృదయము, కౌసల్య కన్నా ఎక్కువగా శ్రీరాముడికై తపించే కైక హృదయం, వారికి దూరం కాబోతున్న శ్రీరాముడి సన్నిధిని పరోక్షంగా మనకు చెబుతాయి. ఎవరైనా దేనినైనా క్షణం విడువలేమని అంటే శాశ్వతంగా దూరమవుతాయనేది ఆధ్యాత్మిక సత్యం.
గుణదభిరాముడు శ్రీరాముడే

"ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః
విద్వాన్ కః కస్సమర్థశ్చక శ్చైక ప్రియదర్శనః
ఆత్మవాన్ కో జిత్రకోధో ద్యుతిమాన్ కో నసూయకః
కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే''
ఈ గుణాలు గుణవంతుడు, వీర్యవంతుడు, «ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు, చారిత్రవంతుడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ఏకప్రియదర్శనుడు ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, అనసూయుడు దేవతలకు కూడా భయం కలిగించేవాడు.
శ్రీరాముడి ఈ గుణాలన్నింటినీ రామాయణం సినిమాల్లో బాపు ప్రస్ఫుటంగా, కళాత్మకంగా ఔచిత్యవంతంగా భిన్న సందర్భాల్లో చిత్రీకరించాడు. జితక్రోధుడు అంటే క్రోధం లేని వాడని కాదు అర్థం. క్రోధాన్ని జయించిన వాడని అర్థం. తన వ్యక్తిగత విషయాల్లో ఎంతటి వేదన అనుభవించవలసి వచ్చినా ఆయనకి క్రోధం రాదు. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అధర్మాన్ని శిక్షించవలసి వచ్చినప్పుడు మాత్రమే, అవసరార్థం ఆయన క్రోధాన్ని తెచ్చుకుని, కార్య సమాప్తిలో తక్షణమే పరిత్యజిస్తాడు. కాబట్టే ఆయనకి వేదన కలిగే ఏ సందర్భంలోనూ క్రోధం రాదు. కైక వనవాసానికి వెళ్ళమన్నప్పుడు కాని, వాలిపై బాణం వేసే సందర్భంలో కాని, రావణాసురుడు తొలిసారి ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏకప్రియదర్శనుడు. సర్వభూత ప్రియుడు. ఈ గుణాలన్నింటినీ తన రామాయణాల్లో శ్రీరామ పాత్రలు ధరించిన వారి ద్వారా బాపు రమణలు అభినయింపజేశారు.
ధర్మం ఆకృతి వహించిన రూపమే రాముడు కాబట్టి ఆయనని 'రామో విగ్రహవాన్ ధర్మః' అన్నారు. అలాంటి రాముడిని హృదయాల్లో నిలిపిన వారికి శ్రీరామరక్ష లభిస్తుంది కదా. శ్రీరామతత్వాన్ని తన సినిమాలన్నింటిలోనూ బాపు రమణలు అంతర్లీనంగా చూపారు.
సంగీత నృత్య దృశ్యకావ్యం 'సీతాకల్యాణం'
శ్రీరాముడు 'పుంసాం మోహన రూపాయ' అన్నట్లుగా జగత్తునే మోహింపజేసినవాడు. వాల్మీకి రాముడిని 'రామః కమల పత్రాక్షః సర్వ సత్వ మనోహరః' అని అభివర్ణించాడు. ఆయన అద్భుత సద్గుణ సౌందర్యం రామాయణమంతటా అనేక సన్నివేశాల్లో బాపు చిత్రీకరించారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒక్క శ్రీరాముడిని మాత్రమే శ్రీరామచంద్రుడని అంటారు. జగత్తుని సమ్మోహనం చేసే శీతల ఆనందకర సద్గుణమూర్తి కాబట్టే ఆయన శ్రీరామచంద్రమూర్తి విషయాన్ని బాపు రమణీయంగా ధ్వనింపజేశాడు. బాలరాముడు, చంద్రుడు కావాలని మారాం చేస్తుంటే సంపూర్ణ రామాయణంలో ఆరుద్రగారి పాట.
'ఎందుకు ఆ చందమామ
అందగాడనా నీ కన్నా
అందరాడనా ఓ కన్నా
తరగని చక్కని జాబిలి... మా సరసనే ఉండగా
తరగని చెరగని వెన్నెల మా కనుల నిండగా'
అదే ఆరుద్ర రామచంద్రుడిని సీతాకళ్యాణంలో ఇలా దర్శింపచేస్తారు.
'చంద్రుని కోసం వెదికే ఇంకో చంద్రుని చూడాలి
అందని చంద్రుని క్రిందికి దింపిన అమ్మని చూడాలి
చంద్రుని చూచి నవ్వే ఇంకో చంద్రుని చూడాలి
రామచంద్రుని చూడాలి'
కొన్ని భావాలు వాచ్యంగా చెబితేనే తెలుస్తాయి. మరికొన్ని అభినయంలో చూపితేనే గ్రహించగలుగుతాము. మరికొన్ని సంగీతంలో వినిపిస్తేనే ఆనందం కలుగుతుంది. తాత్త్విక చింతనలు, అనుభూతుల రూపంలో క్రమక్రమంగా బోధించాలి. రసావిష్కరణలో బాపు రమణలు ఈ ఔచిత్యం పాటించారు. సీతాకళ్యాణం సినిమా ఒక విలక్షణమైన సినిమా, దాన్ని యక్షగానం అనాలో, సంగీత నృత్య దృశ్యకావ్యం అనాలో రసజ్ఞులు నిర్వచించాలి. దీనిలో సంభాషణలు చాలా తక్కువ. ముళ్ళపూడిగారు స్వయంగా ఈ విషయం నాకు స్క్రీన్‌ప్లే చూపుతూ వివరించారు. పాత్రల మనోభావాలన్నీ సంభాషణల ద్వారా తక్కువగాను; సంగీతం, నృత్యం, నేపథ్యం ద్వారా ఎక్కువగాను ఈ సినిమాలో కనిపిస్తుంది. కాబట్టే ఈ సినిమా ప్రపంచంలోనే అంతర్జాతీయ కళాత్మక చిత్రంగా ఖండాంతరాల్లో కీర్తిని ఆర్జించింది.
హనుమకి పరీక్ష 'శ్రీరామాంజనేయ యుద్ధం'
శ్రీరామ పాత్ర వేయడం కోసమే జన్మించిన వారు నందమూరి తారకరామారావు. ఆయన కోరికతో బాపు రమణలు శ్రీరామాంజనేయ యుద్ధం నిర్మించారు. ఎన్.టి.ఆర్. రాముడిగా, బి. సరోజ సీతగా, ఆర్జా జనార్దనరావు హనుమగా అపూర్వంగా నటించిన సినిమా ఇది. యయాతిగా ధూళిపాళ తన నటనా ప్రాభవం చూపారు. రామ నామానికి రామ బాణానికీ జరిగే పోరాటమిది. యయాతి వంటి రామభక్తుడికి ఎదురైన పరీక్ష. శరణన్న వారిని శ్రీరామ పాద సాక్షిగా శరణిచ్చిన హనుమకీ ఇది ఒక పరీక్ష.
శ్రీరామనామ వైశిష్ట్యాన్ని మధురంగా శక్తియుక్తంగా వివరించిన సినిమా ఇది. ధీరదాత్త ధీరశాంత ధీరాలలిత నాయకుడిగా సర్వ భావాలు పలికించడంలో ఎన్.టి. రామారావు అద్భుతంగా నటించారు. ఇలా చెబితే 'సూర్యుడి తేజస్సు ఇలా ఉంటుంది', 'చంద్రుడి వెన్నెల ఇలా ఉంది' అని చెప్పినట్లే. వారి నటనా ప్రాభవాన్ని బాపు సంపూర్ణంగా అభివ్యక్తం చేశారు. హనుమ భక్తి పారవశ్యం మనకందరికీ ఎంతో ఇష్టం. తనివి తీరా ఆయన చేత శ్రీరామగానం చేయిస్తాడు బాపు. సీతారాముల దాంపత్యం వారి మధుర సంభాషణలు మనకెంతో ఆనందం కలిగిస్తాయి. ఇంతకు పూర్వం ఇటువంటి దృశ్యాలు సినిమాల్లో మనకి కనబడలేదు. కాబట్టి అవి ప్రేక్షకులకు ఎంతో తృప్తి కలిగిస్తాయి.
శ్రీరామనామ కృతి కావ్యం 'త్యాగయ్య'
నాద బ్రహ్మోపాసనతో తారక మంత్రంతో తరించినవాడు త్యాగయ్య. శ్రీరామ నామ తత్వాన్ని కృతులుగా అందించాడు. ఈ చిత్రంలో ప్రతి త్యాగరాజ కృతి త్యాగరాజు జీవితంలోని ఒక్కొక్క సుఖ దుఃఖాది అనుభూతుల రూపంలో నుండి జయించినట్లు బాపు రమణలు చూపారు. సర్వకళలు అనుభూతి జనితాలే కదా. త్యాగరాజ కీర్తనల విషయంలో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. త్యాగరాజు జీవితమంతా ఒక్కొక్క ఘట్టంలో పొందిన వేదనని, భక్తిని, పారవశ్యాన్ని, విచికిత్సని, అన్వేషణనీ తాను అనుభవిస్తూ కంఠంలో అభినయిస్తూ జె.వి. సోమయాజులు నోట పలికాడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం.
నాటి సీతకు సాంఘిక రూపకల్పన 'ముత్యాల ముగ్గు'

సీత పాత్రకి సంగీత ప్రతీక. కొత్త పెళ్లికూతురుగా "కన్నె పిల్ల మనస్సు అద్దం లాంటిది. అందులో తాళిగట్టిన భర్త బొమ్మ పడగానే అది పటంగా మారుతుంది'' అంటుంది. ఏ ఋజువులు, సాక్ష్యాలు, విచారణలు లేకుండానే సీతమ్మలా పరిత్యజించబడుతుంది. ఆత్మాభిమానమే కొండంత అండగా జీవిస్తుంది. భక్తుల హృదయమే భగవంతుడి నివాస స్థానం అనే భారతీయ భావనకు ప్రతీకగా భావనారూప ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. నిజం తెలిసిన మామగారు తిరిగి ఇంటికి రమ్మన్నా "సిఫార్సులతో కాపురాలు చక్కబడవు, నేనేమిటో తెలుసుకుని, ఆయనే రమ్మని నన్ను పిలవాలి. అందాక నాతోనే ఉండండి... నాకు ముగ్గురు పిల్లలు అనుకుంటాను'' అంటుంది ఆధునిక సీత మామగారితో.
సీతారాముల కల్యాణ వైభోగం 'అందాల రాముడు'
రామాయణంలో పాత్రలన్నింటి స్వభావాలనీ బాపు రమణలు అందాల రాముడు సినిమాలో చూపారు. గోదావరిపై శ్రీరాముడి కళ్యాణానికై సాగే భద్రాద్రి యాత్రలో మన జీవిత ప్రస్థానం కనిపిస్తుంది. అందరి హృదయాల్లోను భక్తి ఉన్నప్పటికీ ఒక్కొక్కరి ప్రవృత్తి ఈర్ష్య, అసూయ, స్వార్థం, నీచత్వం, కష్టాలు, కన్నీళ్ళు కలిసి పంచుకునే మానవత్వం ఒక «ధర్మం అంతర్లీనంగా కలిసి జీవితాన్ని ఒక్కొక్క విధంగా వీరు చూపారు. వీరందరి మనస్తత్వాలకి సమతుల్యత కల్పిస్తూ అక్కినేని రామాయణం ప్రతిఫలింపజేసిన జీవిత కథానాయకుడిగా కనిపిస్తారు.
***
శబ్ద స్పర్శ రూప రస గంథాలని మనస్సుతో ఆస్వాదిస్తే వచ్చే అనుభూతి అక్షరంలో పలకడం కేవలం బాపు రమణలకే సాధ్యం. శ్రీరామనామం రమణీయంగా మధురంగా సంగీత సాహిత్య నృత్య కళల్లో రసజ్ఞుల హృదయాల్లో శాశ్వతంగా నిలిపారు బాపు రమణలు.
కళా సౌందర్యాన్ని జ్ఞాన రూపంలో అందించడం బాపు రమణల ప్రతిభకు ఒక నిదర్శనం. వాల్మీకిది ధర్మ దృష్టి. వ్యాసుడిది జ్ఞాన దృష్టి. తిక్కన కాళిదాసాదులది రస దృష్టి. ఈ మూడూ కలిపితే వచ్చే దర్శనం బాపు రమణల రామాయణ దర్శనమవుతుంది.
No comments:
Post a Comment