
లోకంలో ఎన్నిరకాల నవ్వులున్నాయో ముళ్లపూడి తన సాహితీ దర్పణం లో చూపిస్తాడు. ఖరీదైన జరీకండువా గుబురు మీసాల నవ్వులు, అందమైన రాధమ్మ సిగ్గు దొంతరల మల్లెపూల పరిమళాల నవ్వులు, తన చాతకానితనం మీద తనే జోకు వేసుకుని నవ్వే అసమర్థపు నవ్వులు... జేబులో ఉన్న ఒక్క రూపాయి తనని చూసి నవ్వుతుంటే దాని నోరుమూయించి,కొడుక్కి మూడు చక్రాల సైకిలు బేరమాడి, ఖరీదుగా కనిపించాలని షావుకారుతో మధ్యతరగతి తండ్రి నవ్వులు వినిపిస్తాడు- నవ్వుల మీద కాపీరైటున్న ముళ్లపూడి.
'హన్నా' అనిపించే ప్రేమ కథలవి

'గౌరి'ని సృష్టించింది రమణే
రక్తసంబంధం వంటి అనురాగభరిత, దుఃఖపూరిత విషాదాంత సినిమా కథతో ముళ్లపూడిగారి సినిమా జీవితం ప్రారంభమయింది. మూగమనసులు సినిమా కథ ముళ్లపూడి చేతికి వచ్చి, అందమైన మలుపులు తిరిగింది. ఆత్రేయ స్క్రిప్టు రాసి ఇచ్చాక ఆదుర్తి సుబ్బారావుకి పాత్రల మధ్య ప్రేమ నచ్చలేదట. 'పడవ నడుపుకునేవాడికి, 'అమ్మాయి'గారికి మధ్య లవ్వు బాలేదు' అని ఆదుర్తి అంటే- ముళ్లపూడి సృష్టించిన మూడో పాత్ర గౌరి అట.
ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం
తెలుగు సినీ ప్రపంచంలోని ప్రముఖులందరినీ పరిచయం చేశారు ముళ్లపూడి. అక్కినేని నాగేశ్వరరావుగారిపై 'క«థా నాయకుడి కథ' చాలా సుప్రసిద్ధమైనది. అక్కినేని సినీ జీవితాన్ని, నిజ జీవితాన్ని ఏకకాలంలో అద్దం పట్టి చూపాడు. 'జూల్స్‌వెర్న్' రాసిన ఆంగ్ల నవలకి 'ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం' ముళ్లపూడి రాసిన అనువాద నవల. అందులో అచ్చ తెలుగు నుడికారం కనిపిస్తుంది. 'దున్నలొస్తే రైళ్లాపుకుంటామా, దున్నలని దున్నవతల పారేయక చూస్తారే' అంటారు పాస్పార్తు ఫ్రెంచి ఆవేశంతో ఒకదగ్గర.
'ముత్యాలముగు'్గ హాస్యం పేలింది
హాస్యం అంటే ముళ్లపూడి మాటల్లో... 'నా మటుకు నాకు హాస్యం అనేది దృశ్యపరంగా ఉంటేనే బాగుండుననిపిస్తుంది. కామెడీలో డైలాగ్ అనేది వేరే డిపార్ట్‌మెంట్, మన తెలుగు సినిమా అంతా ఎక్కువ డైలాగ్స్ మీద ఆధారపడిన కామెడీనే. ఆ విధంగా నేను రాసిన వాటిల్లో రావుగోపాలరావుగారి మీద భక్త కన్నప్పలో కానీ, ముత్యాలముగ్గులో కానీ అంతా డైలాగ్ ఓరియెంటెడ్ కామెడీనే. హాల్లో ప్రేక్షకులు నవ్వినంత మాత్రాన అది మంచి కామెడీ అని అనుకోవడానికి వీల్లేదు. 'అందాల రాముడు' సినిమా చూస్తూ 'సిల్వర్ జూబిలీ' అవుతుందని మేము అనుకునేటంతగా జనం నవ్వారు. కాని అది ఏవరేజ్ అయింది. 'ముత్యాల ముగ్గు' సినిమా హాల్లో పెద్దగా ఎవరూ నవ్వలేదు. కాని అదే అత్యధిక ప్రజాదరణ పొందిన హాస్యం అయింది.'
'బొమ్మ' బాపు - 'ఆత్మ' ముళ్లపూడి
నిజానికి బాపు అంటే ముళ్లపూడి. ముళ్లపూడి అంటే బాపు. సాక్షి సినిమాతో ప్రారంభమైన వారి సినీ జీవిత కావ్య రచన ప్రస్తుత బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' దాకా అప్రతిహతంగా సాగింది. బాపుగారితో "మీరింత గొప్పగా సినిమా తీస్తారు కదా...'' అని నేను అన్నప్పుడు, బాపు గారు కట్ చేసి "అసలు ఆ గొప్పతనమంతా రమణ స్క్రిప్టులోనే ఉందండి. మొత్తం ఆయన ప్రతి కోణం రాసి ఇస్తేనే ... నేను తీస్తాను'' అన్నారు. కథానాయికల కట్టూబొట్టూ నడక వయ్యారం కులుకు కలిసి బాపు బొమ్మ తయారయితే అందులో ఆత్మ ముళ్లపూడిది.
సీగాన పెసూనాంబ
ఆయన అల్లరి బుడుగు ఇంటింటా కనిపిస్తాడు. పిల్లల్లోని చిన్ని చిన్ని సరదాలని, పెద్దల చిన్న మనసులని కూడా ముళ్ళపూడి 'బుడుగు'లో చూపుతాడు. భాష కూడా చిత్రంగా ఉంటుంది. "సీగాన పెసూనాంబ''. "గుండు మీద గాఠిగా ప్రైవేటు చెప్పేయడం'', "జాఠర్ ఢమాల్'' లాంటివి.
బాలకృష్ణతో ఆ కోరిక తీర్చాడు

'సంపూర్ణ రామాయణం' అంత పెద్ద సంచలనమా! కాని 'ఓ కార్టూనిస్టు, కమ్యూనిస్టు, జోకర్ కలిసి రామాయణం తీస్తారట' అని ఆ రోజుల్లో విమర్శించారట. ఎన్టీఆర్ కూడా అలిగారట. ఆ త్రయం బాపు రమణ ఆర్రుదలు. సంపూర్ణ రామాయణం సినిమాలో ఆరుద్ర పాటలు, ముళ్ళపూడి సంభాషణలు ఇప్పటికీ మారుమోగుతుంటాయి. ఆద్యంతం రామాయణం చూపిన సినిమా ఇదొక్కటే. తర్వాత ఎన్టీఆర్ కూడా భేష్ అని మెచ్చేసుకుని, బాపు రమణలని లవకుశ తనతో మళ్లీ తీయమని కోరారట. ఆ కోరిక అప్పుడు ఆయనకి తీరలేదు కాని, ముళ్ళపూడి రచనతో ఇప్పుడు శ్రీరామరాజ్యంగా బాలకృష్ణగారితో తీరబోతోంది.
ఆత్మాభిమానం కథానాయికలు
మిస్టర్ పెళ్లాం, రాధాగోపాలం, పెళ్లిపుస్తకం సినిమా కథల్లో ముళ్ళపూడి ఆత్మాభిమానం కల నాయికలని సృష్టించాడు. 'మగవారికి అహంకారం ఎక్కువ. ఆయన ఇప్పుడు మా ఆయన కాబోతున్నాడు కదా. దాన్ని ఆత్మవిశ్వాసం అనాలేమో అంటుంది' ఓ నాయిక. రాధాగోపాలం కథ, సినిమా రెండూ వేరు వేరు. 'మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం. ఆడవాళ్ళు కాస్త తక్కువ సమానం' అంటాడు ముళ్ళపూడి రాధాగోపాలంలో వ్యంగ్యంగా.
రాధాగోపాలం కథలో గోపాలం రాధని వైకేరియన్ లయబిలిటీ క్రింద మీ నాన్నని డబ్బులు కట్టమని అంటాడు. ఇదో గొప్ప లయబిలిటీ. ఇంతకీ ఏమిటి అది అంటే రాధ అందంగా రెండు చిరునవ్వులు నవ్వితే స్నేహితులకి గోపాలం ఇచ్చిన పార్టీలు. "ఎస్టాబ్లిష్‌మెంట్ ఛార్జీలు అయ్యాయి. మీ నాన్నని ఇవన్నీ కట్టమను'' అంటాడు. ఇలాంటి చార్జీలు వైకేరియన్ లయబిటీలు ఈ యువతరంలో చాలా ఎక్కువేమో.
అద్భుత 'కానుక'
ఆయన కథల్లో ఆణిముత్యం 'కానుక'. ఈ కథలో గోపన్న మురళీగానప్రియుడు. నిత్యం శ్రీకృష్ణుడిని బృందావనంలో చూస్తుండేవాడు. ఆ మురళీగానంలో కరిగి ప్రవహించేవాడు. కృష్ణుడి మువ్వల మురళి లాంటి మురళి తానూ తయారుచేయాలనుకున్నాడు. కృష్ణుడు నాట్యం చేస్తుంటే ఆ మురళిని ఎత్తుకొస్తాడు. తెల్లారంగానే కృష్ణుడు చావిట్లోకి వచ్చి "గోపన్నా! నా మురళి ఎత్తుకు పోయావు కదూ! పోనీలే ఇంకోటి చేసీయి'' అంటాడు. ఈ గజదొంగ దగ్గర నేను దొంగతనం చేయడమేమిటి అనుకుంటాడు గోపన్న. వేణువు కోసం యజ్ఞం ప్రారంభమయింది. ఎన్ని చేసినా ప్రతి మురళిలో ఏదో ఒక లోపం. సంవత్సరాలు గడిచిపోయాయి. గోపన్నకి చిన్న గోపన్న పుట్టాడు. అయినా కాలంతో పాటు గోపన్న పట్టుదల పెరిగింది. కృష్ణుడు చివరిసారి రేపల్లెకి వచ్చాడు. ఇప్పటికీ ఇవ్వలేకపోతే తన జన్మ వ్యర్థం. తన శక్తినంతా ధారపోసి ఒక మురళిని చేసి కొడుకు చేతిలో పెట్టి 'తెల్లవారితే కృష్ణాష్టమి. రేపు దీనిని కృష్ణుడికి ఇవ్వు' అంటాడు. చిన్న గోపన్న అటక మీద ఉన్న వేల మురళుల్లో పొరపాటున దానిని కలిపేస్తాడు.
ఇప్పుడు ఆ మురళి ఎలా దొరుకుతుంది? గోపన్న ప్రతి మురళిని వాయించి చూస్తాడు. ఇది కాదు.. ఇది కాదు.. 'న ఇతి వాదం' 'నేతివాదం' చిట్టచివరికి ఒకే మురళి మిగులుతుంది. దాన్ని పరీక్షించే సాహసం లేకపోయింది గోపన్నకి. 'ఇదే' అని చివరి మురళిని చిన్న గోపన్నకి ఇచ్చి పంపుతాడు. జీవితంలో మొదటిసారి నడుము వాలుస్తాడు. తాను పనికిరావని విసిరిపారేసిన వేణువులన్నీ వేయి నాదాలతో అద్భుతంగా వేణుగానం ఆలపిస్తాయి. 'అయ్యో ఎంత పొరబాటు' అద్భుత గాన సౌందర్యం ఆ విశ్వమోహనుడి జిలిబిలి పెదవులది కాని, ఈ వెదురు ముక్కది కాదు కదా... ఆ పెదవి సోకిన ప్రతి మురళి నాదం పలుకుతుంది. సృష్టిలో పనికిరాని మురళే లేదు. ప్రతి వ్యక్తి ఒక మురళే. ఈ రహస్యం తెలియడానికి ఒక జీవితం పట్టిందా ప్రభూ! అంటాడు గోపన్న. ఈ కథ కధానికా ప్రపంచం ఉన్నంతకాలం నిలబడుతుంది.
టీవీకి భాగవత కథలు రాసినా, బాపు రామాయణాల్లో రామకథలు రాసినా ... బుడుగు చేతల్లో, అప్పారావు ఋణానందలహరిలో, లవ్వు కథల నుండి శ్రీకృష్ణుడి లీలా మానుష కార్యాల దాకా ముళ్ళపూడి విశ్వరూపం కనిపిస్తుంది. 'మేడ మీద మేడకట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందూ' అని 'ప్రేమించి చూడు'లో రాసినా, భాగవతంలో కృష్ణుడిపై పాటలు రాసినా ఆ కలం ఏ ప్రక్రియకైనా రసాలు ఒలికిస్తుంది. జీవితంలోని సమస్త అనుభూతులను మనకి ముళ్ళపూడి దర్శనం చేయిస్తాడు.
- డా. పి.ఎల్.ఎన్. ప్రసాద్
98665 65863
98665 65863
No comments:
Post a Comment