Bapu-Ramana Music Hits

Tuesday, January 12, 2010

బాపు రమణీయం * మూగబోయిన 'ముత్యాల' మాట * నవ్వుల కలం ఆగింది

తెలుగు చిత్రపరిశ్రమ మరో ప్రతిభావంతుణ్ణి కోల్పోయింది. ముళ్లపూడి వెంకటరమణ మరిలేరు అనే విషయం సాహితీ ప్రియులకే కాదు సామాన్య ప్రేక్షకులచేత కూడా కంటతడి పెట్టిస్తుంది. మూసకట్టు ఒరవడిని పక్కన పెట్టి కొత్తరకంగా కథలు అవి రాసేసిన రమణని పట్టుకుని, పనిగట్టుకుని సినిమారంగానికి తీసుకువచ్చేశారు కొంత మంది నిర్మాతలు. సినిమా అంటే దృశ్యప్రధానం కానీ శ్రవణ ప్రధానం కాదని నమ్మడమే కాదు అక్షరాలా ఆచరించి చూపారు. సినిమా షూటింగ్‌కు ముందే పూర్తి స్క్రిప్ట్ తయారు చేయడం రమణకి అలవాటు. సొంత సినిమా అయినా, బయట నిర్మాత సినిమా అయినా అదే పద్దతి.

సొంత సినిమా నిర్మాణసమయంలో ప్రొడక్షన్, బిజినెస్ చూడాల్సి వస్తుంది కనుక ముందే స్క్రిప్ట్ తయారు చేసేవారు. ఒకసారి రాసిన తర్వాత షూటింగ్ స్పాట్‌లో దాన్ని మార్చే అవసరం వచ్చేది కాదు. బయట చిత్రాలకు రాస్తున్నప్పుడు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'శ్రీరామరాజ్యం' సినిమా స్క్రిప్ట్ కూడా నిర్మాతకు ముందే అందచేశారు రమణ. విజువల్‌గా, అందంగా ఎలా చెప్పడం అన్నది ఊహించి సంభాషణలు రాసేవారు.

కథకుడిగా, విమర్శకుడిగా, వ్యాసకర్తగా, అనువాదకర్తగా రమణ తన రచనాసామర్ధ్యాన్ని ప్రదర్శించినా ఆయన పేరు ఇప్పటికీ జనం నోళ్లలో నానడానికి కారణం సినిమాలే అని చెప్పాలి. వెకిలితనమే హాస్యంగా చెలామణి అయినరోజుల్లో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన కలం రమణది. ఆయన హాస్యం పన్నీ రు చిలకరించినట్లుగా ఉంటుంది. ఇక వ్యంగమైతే చురుక్కుమనిపిస్తుంది. సినీరంగంలోకి అడుగుపెట్టకముందు తెలుగు, హిందీ, ఆంగ్ల చిత్రాల సమీక్షకుడిగా ఒక చరిత్ర సృష్టించారు. సినిమా తీసినవారి గతచరిత్ర ఎంత ఘనంగా ఉన్నా నిర్భయంగా విమర్శిస్తూ, తమాషాగా చురకలు వేస్తూ సమీక్షలతో పాఠకులకు చేరువయ్యారు.

ఇక సినీ రచయితగా రమణ సృష్టించిన పాత్రలు, మాటలు విలక్షణీయమైనవి. 'మడిసన్నాక కూసింత కలాపోసణుండాల, ఊరికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది' అని 'ముత్యాలముగ్గు' చిత్రంలో కంట్రాక్టర్‌తో పలికించిన మాట తెలుగు సినిమా ఉన్నంతవరకూ ప్రతి ఒక్కరికీ గుర్తుంటుంది. సినిమా డైలాగులు ఓ రికార్డుగా రావడమన్నది ఈ సినిమాతోనే మొదలైంది. అలాగే 'గోరంతదీపం' చిత్రంలో కూతురు అత్తవారింటికి వెళుతుంటే తండ్రి చెబుతాడు ' నువ్వు హాయిగా, సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్లను తలుచుకో.. చూడ్డానికి రా.. ఓడిపోతున్నప్పుడు , కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు. నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి. నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి' అని. అలాగే 'గుడిగంటలు' చిత్రంలో మరో మంచి డైలాగు ఉంది.

'పెదవుల మీది చిరునవ్వు అల్పమైన సుఖానికి, సంతోషానికి పుడుతుంది. ఇట్టే చెరిగిపోతుంది. ఈనాడు మనసారా మీకు సేవ చేయడం వల్ల కలిగే ఆనందం గాఢమైనది. అది హృదయంలో పుడుతుంది. అక్కడే ఉంటుంది. పెదవుల దాకా రాదు'. రమణ తొలి చిత్రం 'దాగుడుమూతలు' అయినా విడుదలైన తొలి సినిమా మాత్రం 'రక్తసంబంధం'. పుస్తకజ్ఞానం తప్ప ప్రపంచజ్ఞానం తెలియని వాళ్లు ఎలా మాట్లాడతారో 'దాగుడుమూతలు' చిత్రంలో పద్మనాభం పాత్రద్వారా చెప్పించారు. 'తాతయ్యకు బోల్డు ఆస్తి ఉండును. దానిని వాళ్లు మనుమలకు ఇచ్చేదరు. అంతవరకూ మనము అమ్మడిని పెళ్లి చేసుకోరాదు అని అమ్మ చెప్పును'... ఈ డైలాగులన్నీ జీవనసత్యాలే. అలాగే 'భక్త కన్నప్ప' సినిమాలో మరో డైలాగు ఉంది... ' శివుని మూడో కంట భగ్గుమనే మంటా ఉంది, ఓదార్చే వెన్నెలా ఉంది.

అసలు మూడో కన్ను శివుడికే కాదు జీవులందరికీ ఉంది. మూడో కన్నంటే లో వెలుగు. మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో. ఎదుటివాడి గొప్పనే తెలుసుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది దీపం పెద్దదవుతుంది. దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను. ఆ కంటి సిరి నీ కండసిరికన్నా గొప్పది...' ఈ డైలాగు ఆ చిత్రంలోని ఆ పాత్రకే కాదు ఎప్పుడైనా ఎవరికైనా వర్తిస్తుంది.

అదే విధంగా 'వాడికి డబ్బు చేసింది', 'ఆశ్చర్యపడి పోయి లేచాను', 'నీకు ధనబద్ధకం' 'దాఋణం', ' తుత్తి' 'ఆమ్యాయ్యా', 'తీతా'(తీసేసిని తాసిల్దార్) వంటి కొత్త పదాలను సృష్టించిన ఘనత రమణదే. నవ్వితే తమ స్టేటస్‌కి భంగం అనుకునే మేధావులను సైతం ఎలాంటి భేషజాలూ లేకుండా నవ్వించిన కలం ఆయనది. తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్రకథానాయకులందరి చిత్రాలకు రచన చేశారు రమణ. ముఖ్యంగా ఎన్టీఆర్, ఎఎన్నార్‌తో ఆయనకు అనుబంధం ఎక్కువ. అక్కినేని జీవిత కథను 'కథానాయకుడి కథ' పేరుతో పుస్తకరూపంలో తెచ్చారు రమణ.

అలాగే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాపు,రమణతో వీడియో పాఠాలు తయారు చేయించారు. అలాగే కృష్ణ నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' చిత్రానికి రమణే రచయిత. హీరోగా కృష్ణ ఎదుగుతున్న దశలో తమ తొలి సినిమా 'సాక్షి'లో మంచి అవకాశం కల్పించి ఆయన కెరీర్‌కు పటిష్టమైన పునాది ఏర్పరచారు. అదే విధంగా శోభన్‌బాబుకు 'సంపూర్ణరామాయణం' చిత్రాన్ని, కృష్ణంరాజుకు 'భక్త కన్నప్ప' చిత్రాన్ని అందించి వారి స్థాయిని పెంచారు బాపు, రమణ.

బాపు బొమ్మకి మాటలు నేర్పిన వాడు రమణ అయితే, రమన మాటలకు రూపం ఇచ్చిన వ్యక్తి బాపు. బాల్యంలో ఏర్పడిన వీరి స్నేహబంధం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. స్నేహం అనేది వ్యాపారాత్మకం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి అతీతంగా ఉంటూ తమ స్నేహం గురించి వారు చెప్పుకోకుండా, ఇతరులు చెప్పుకునే స్థాయిలో వారి స్నేహబంధం ఉంది. బాపు బొమ్మయితే, రమణ బొరుసు. మరి అటువంటి ప్రాణస్నేహితుణ్ణి కోల్పోయిన బాపుని ఓదార్చడం ఎవరి తరం!

నిన్న 'పాట'...నేడు 'మాట'...

తెలుగుజాతి గత ఏడాది 'పాట'ను కోల్పోయింది. నేడు 'మాట'ను కోల్పోయింది. నెలరోజుల క్రితం సంపాదక ప్రముఖుడ్ని (చందూర్) కోల్పోయింది. సాహిత్యంలో, మరీ ముఖ్యంగా చలనచిత్రసీమలో సునిశిత హాస్యాన్ని అసమానంగా పండించిన మితభాషి ముళ్లపూడి వెంకటరమణ సాహితీ ప్రియులకు అమిత బాధను మిగిల్చి వెళ్లిపోయారు.'రాత-గీత' ద్వయంలో (బాపు-రమణ)'రాత' నిష్క్రమించింది. బుడతజంట 'బుడుగు-సిీగాన పెసూనాంబ', యువజంట 'రాధా-గోపాళం' 'పక్కింటి లావుపాటి పిన్నిగారు, 'ఆవిడ మొగుడు', రెండుజెళ్లసీత, కలాపోసనగల మర్డర్ల కాంట్రాక్టర్, ఆయన సెగట్రీ, అద్దె భజంత్రీలు, నిత్యపెళ్లికొడుకు, అప్పుల అప్పారావు, 'తీతా', దొరవారి సహాయకుడు'కన్నప్ప'ఇలా ఒకరేమిటి...ఎన్నెన్నో పాత్రలతో పాటు తెలుగుపాఠక, ప్రేక్షకజనం.. మరీ ముఖ్యంగా హాస్యప్రియులు కలతచెందారు.

నీవుంటే వేరే కనులెందుకు..

'నీవుంటే వేరే కనులెందుకు..నీ కంటే వేరే బ్రతుకెందుకు నీ బాట లోని అడుగులు నావే' అంటూ స్నేహతత్వాన్ని ఆవిష్కరించిన ప్రాణస్నేహితులు. కొన్ని జంటలను వేర్వేరుగా చూడలే(రు)ము. ఉదాహరణకు, తెలుగు అవధాన ప్రక్రియకు వెలుగురేఖలు తిరుపతి వెంకటకవులను స్నేహానికి చిరునామాగా చెబుతారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి అస్తమించినా (1919) మిత్రులు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి తుది వరకు (1950) తమ సాహితీ వ్యాసంగాన్ని 'జంటకవులు' పేరుతోనే సాగించి మైత్రీబం«ధాన్ని కొనసాగించారు. ఇక తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఎన్ని జంటలు పని చేసినా తొలితరంలో 'నాగిరెడ్డి-చక్రపాణి' మలితరంలో 'బాపు-రమణ' చెప్పదగిన జంటలు. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా' అన్న వేమన మాట ఈ 'స్నేహజంట'కు అమ్మ పాలంత స్వచ్ఛంగా పొసగుతుంది.

ఇది మెచ్చుకోలు కాదు.'అచ్చకోలు'.రెండు శరీరాలకు ఒకే ఆత్మ 'బాపు- రమణ' అంటారు అభిమానులు. 'ఒకే ఇల్లు,ఒకే ప్రాణం, ఒకే వ్యాపకం, బొమ్మా-బొరుసు, తోడు-నీడ... ఇలా అన్నీనూ! అందుకే 'బాపురే(ర)మణ' అన్నారు సినారె. అభిప్రాయభేదాలు అంటూ ఉంటే (వృత్తిపరంగా) అవి అంతవరకేనట! 'స్నేహం చేసే ముందు ఆలోచించు. ఆ తరువాత కడదాక కొనసాగించు' అన్న సూక్తి వీరిముందు వెలవెల పోవలసిందే. ఎందుకంటే వీరిది 'కాంట్రాక్టు/సిఫారుసు/మొహమాటం/అవసరాల'స్నేహం కాదు కాబట్టి.

'సిఫార్సులతో కాపురాలు చక్కబడవన్న' ముత్యాలముగ్గు నాయిక మాటలు స్నేహానికీ వర్తిస్తాయని రుజువు చేసింది ఈ జంట. ఇదే విషయాన్ని ముళ్లపూడి వారితో ప్రస్తావిస్తే, భార్యాభర్తల మధ్యకాని, స్నేహితుల మధ్య కానీ నమ్మకం ముఖ్యం అనేవారు. ఆ విషయాన్నే ఆయన సినిమా సంభాషణల్లో ఆవిష్కరించారు. నచ్చని వ్యక్తుల గురించి వ్యాఖ్యానించడం కంటే మౌనంగా ఉండడం ఉత్తమం అనీ మరీ చెప్పవలసి వస్తే వారి పేర్లు ప్రస్తావనకు రాకుండా క్లుప్తంగా సైగలతో చెప్పడం ఆయన ప్రత్యేకత. అదే సమయంలో నచ్చిన వ్యక్తి గురించి, నచ్చిన రచన గురించి ఢంకా బజాయించి కితాబు ఇచ్చేవారు. పూర్వకవులన్నా, వారి రచనలన్నా మక్కువ ఎక్కువ.

వారి పాత్రలకు కొనసాగింపునిచ్చి చిరస్మరణీయం చేసిన ఘట్టాలూ ఉన్నాయి. గురజాడ వారి అపురూప సృష్ట 'గిరీశం'. దానిని అందిపుచ్చుకున్న ముళ్లపూడి ఆ పాత్రతో ఉపన్యాసాలు (లెక్చర్లు)ఇప్పించారు. మొక్కపాటి 'బారిస్టర్ పార్వతీశం', చిలకమర్తి వారి 'జంఘాలశాస్త్రి', మునిమాణ్యిం 'కాంతం' పాత్రల మాదిరిగానే ముళ్లపూడి అనేక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అవన్నీ మధ్యతరగతి జీవితాల నుంచిపుట్టినవే.

మాటల బ్రహ్మ
విత్తు ముందా చెట్టు ముందా అనే సామెతకు ఈ ఇద్దరిమిత్రుల భావనలకు సామ్యం ఉంది. 'వాడికి (బాపు) కాంటెంపరరీగా ఉండడం మన అదృష్టం' అని రమణ అంటే 'నేనూ అంతే' అనే భావం వ్యక్తపరుస్తారు బాపు. అందుకే 'బాపు రమణీయం.' తమను మహానుభావులు అని ఎవరైనా సంబోధిస్తే 'మహా'కాదు..'ఉత్తభావుణ్నే' అని చెప్పుకున్న చమత్కారి. కంచర్లగోపన్న ఉరఫ్ రామదాసు రాముల వారి ఆలయాన్ని 'అప్పు'చేసి కట్టించారేమోనని హాస్యమాడారు. 'విష్ణుమూర్తులోరు స్వయంగా ప్రత్యక్షమై భక్తా ఏం కావాలో కోరుకోమంటే.. ముందు మా మేనమావ సెవిలో ఎంట్రుకలు మొలిపించు. తతిమ్మాది నేజూసుకుంటా' అని వరమడిగేసి, 'చెవి వెంట్రుకల' వెనుకున్న రహస్యం ఏమిటో ప్రేక్షకులకు వదిలేశారు. ఇలాంటి చమత్కార కలానికి హాస్యం 'రుణపడిలేదూ!'

గుండె గొంతుకలోన...

తక్కువ అక్షరాల్లో ఎక్కువ అర్థం చెప్పాలన్న సత్యం ముళ్లపూడి శైలిలోను, ఆయన వ్యక్తిత్వంలోనూ కనిపిస్తుంది. .తక్కువ మాట్లాడు ఎక్కువ పనిచేయి' అనే సూక్తో, 'గంగిగోవుపాలు గరిటడైనను చాలు' అనే శతకకర్త మాట అందుకు స్ఫూర్తో తెలియదు. ఆచరణలో మాత్రం అది స్పష్టమయ్యేది. ఇటీవల రవీంద్రభారతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న సందర్భంలో ఆయన స్పందనే అందుకు తాజా ఉదాహరణ.

'ఆనాడు ఆయన (ఎన్టీఆర్) ఆదరించారు-ఇప్పుడు మీరు (లక్ష్మీపార్వతి) ఆదరించారు' అని ఒకే ముక్కతో ధన్యవాదాలు చెప్పారు. అవునూ! ఇంత 'మితభాషు'లు అన్ని కళాఖండాలు ఎలా సృష్టించారన్నది అభిమానుల సందేహం. ఫలాని వారి మరణం తీరనిలోటు అని వినిపించే మాటల్లో ఎంత నిజమో కానీ 'ముళ్లపూడి' నిష్క్రమణ విషయంలో మాత్రం అది నిఖార్సైనదే. 'గుండె గొంతుకలోన కొట్లాడుతాది' అన్న నండూరి వారి మాటకు అర్థం ఈ విషాదవేళ స్ఫురిస్తోంది. 

నవ్వుల కలం ఆగింది
ముళ్లపూడి కన్నుమూత

ఫ్లూ జ్వరంలో మృతి
ఆఖరి క్షణాలూ బాపూ చెంతే
తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి
శుక్రవారం చెన్నైలో అంత్యక్రియలు
చెన్నై, ఫిబ్రవరి 24 : తెలుగు తెరను గోదారి నీళ్లతో అభిషేకించిన నిఖార్సైన తెలుగోడు మరిలేరు. తెలుగుకు గుడి కట్టిన నవ్వుల కలం ఆగిపోయింది. తెలుగు వారి బాల్యాలకు 'బుడుగు'ను కానుకగా ఇచ్చిన నిత్య బాలకుడు ముఖం చాటేశారు. 'కోతి కొమ్మచ్చి' ఆడుతూనే, అందరినీ ఆదమరిపించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సుప్రసిద్ధ రచయిత, సీనియర్ పాత్రికేయుడు, స్నేహ బంధానికి పర్యాయపదం ముళ్లపూడి వెంకట రమణ చెన్నైలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఫ్లూ జ్వరంతో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ప్రాణ మిత్రుడు, ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపూ ఆయన పక్కనే ఉన్నారు. 80 ఏళ్ల ముళ్లపూడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ముళ్లపూడి వర సినీ దర్శకుడిగా పరిశ్రమలో స్థిరపడ్డారు. కుమార్తె అమెరికాలో ఉన్నారు.

ఆమె శుక్రవారం వచ్చే అవకాశముందని, ఆమె రాగానే చెన్నైలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. ముళ్లపూడి మృతి వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, తాతినేని రామారావు, సినీ విమర్శకుడు వీఏకే రంగారావు, గీత రచయిత భువనచంద్ర, రచయిత్రి మాలతీచందూర్, నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం వారిలో ఉన్నారు.

కష్టాల కాపురం

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 1931 జూన్ 28న ముళ్లపూడి వెంకటరమణ జన్మించారు. తొమ్మిదేళ్లకే తండ్రి మరణించారు. ఇల్లు గడవడం కష్టమై.. కుటుంబంతో మద్రాస్ చేరుకున్నారు. తొలుత ఆంధ్ర మహిళాసభలో పని చేయడంతో పాటు పలు కష్టలు పడ్డారు. 5,6 తరగతులను ఏలూరులో, 7,8 తరగతులను రాజమండ్రిలోని వీరేశలింగం స్కూల్లో, ఎస్ఎస్ఎల్‌సీని మద్రాస్‌లోని పీఎస్ స్కూల్లో పూర్తి చేశారు. అక్కడే బాపూతో పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ కలసి 'ఉదయభాను' రాతపత్రికను ప్రారంభించారు. రమణ రాస్తే, బాపూ బొమ్మలు గీసేవారు. 1945లో రమణ తొలి కథ 'అమ్మ మాట వినకపోతే..' 'బాల' మాసపత్రికలో ప్రచురితమైంది. 1954లో ముళ్లపూడి ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరారు. అనంతరం వారపత్రికకు మారి, సినిమా విభాగాన్ని పర్యవేక్షించేవారు. ఇదే సినిమా వైపు మరలడానికి కారణమైంది.

ఆయన కథ అందించిన తొలిచిత్రం 'రక్తసంబంధం'. మూగమనసులు, దాగుడుమూతలు, సాక్షి, బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప, రాధాకళ్యాణం, మంత్రిగారి వియ్యంకుడు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీనాధ కవి సార్వభౌముడు తదితర 39 సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు అందించారు. బాపూ దర్శకత్వంలోనే ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. ఆయన కథ రాస్తే, బాపూ దృశ్య చిత్రీకరణ చేసేవారు. చిత్రకల్పన బ్యానర్ పేరిట సొంత ప్రొడక్షన్ ప్రారంభించి, అందాల రాముడు, సీతాకళ్యాణం తదితర నాలుగు చిత్రాలను ముళ్లపూడి నిర్మించారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "శ్రీరామరాజ్యం'' ముళ్లపూడి చివరి సినిమా.

చిరంజీవి బుడుగు: తానున్నా లేకున్నా తన 'బుడుగు' చిరకాలం వుంటాడని ముళ్లపూడి ఓ ఇంటర్వ్యూలో 'ఆన్‌లైన్'తో అన్నారు. ఆయన సృష్టించిన బుడుగు పాత్ర తెలుగునాట అంత ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. నిజానికి ముళ్లపూడిని ఆయన తల్లి బుడుగు అని పిలిచేవారు. ఆమెపై ప్రేమతోనే ఆ పాత్రను సృష్టించారు. ముళ్లపూడికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు నంది అవార్డులను అందజేసింది. ప్రతిష్ఠాత్మమైన రఘుపతి వెంకయ్య అవార్డును బాపూతో కలసి పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1995లో రాజలక్ష్మి పురస్కారాలను అందుకున్నారు. ఎస్వీ, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీలు ముళ్లపూడికి గౌరవ డాక్టరేట్ అందజేశాయి.

ప్రముఖుల సంతాపం: ముళ్లపూడి వెంకటరమణ మృతికి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వెలిబుచ్చారు. బాపు-రమణల కలయికలో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలు వచ్చేవని, ముళ్లపూడి మరణంతో ఒక అధ్యాయం ముగిసిందని సీఎం అన్నారు. ముళ్లపూడి హఠాన్మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వెలిబుచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. ఎన్టీఆర్‌తో శ్రీనాథ కవిసార్వభౌమ సినిమాకు పనిచేశారని, బాలకృష్ణతో శ్రీరామరాజ్యం సినిమాకు పనిచేస్తున్నారని గుర్తు చేసుకున్నారు.

ఆయన మృతి తెలుగు చిత్రరంగానికి తీరని లోటన్నారు. ముళ్లపూడి మృతికి మాజీ సీఎం రోశయ్య విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముళ్లపూడి రాసిన 'బుడుగు' రచన, తెలుగువారికి ప్రత్యేకమైందని పీఆర్పీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాపు-ముళ్లపూడి సినిమాల్లో సంభాషణలు, బొమ్మలు తెలుగు జాతి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఇందుకు ముత్యాలముగ్గు ఉదాహరణ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన రచనలతో ఆబాలగోపాలాన్ని అలరించిన రచయితల్లో ముళ్లపూడి ఒకరని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.

ప్రాథమిక విద్యాబోధనను బాగుచేసేందుకు ఆయన ఎంతో తపనతో కృషి చేసినా, పాలకులు వినియోగించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని కృత్రిమత్వాన్ని, మనుషుల మనస్తత్వాల్లోని వికారాల్ని సరిచేసుకునేందుకు వెంకటరమణ సృజనాత్మక రచనలు చేశారన్నారు. ఆయన 'బుడుగు' నేటికీ పెద్ద బాలశిక్షలాగా విదేశాల్లోని తెలుగువారు భద్రపరుచుకుంటున్నారన్నారు. ముళ్లపూడి కుటుంబ సభ్యులకు, బాపుకు తన సంతాపాన్ని తెలిపారు. సృజనాత్మక చిత్రాలకు మాటలు రాయడంలో ముళ్లపూడి దిట్ట అని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులి సాంబశివరావు, పల్లె నర్సింహులు అన్నారు.
Click Here!

No comments: