చెన్నై, ఫిబ్రవరి 24 : తెలుగు తెరను గోదారి నీళ్లతో అభిషేకించిన నిఖార్సైన తెలుగోడు మరిలేరు. తెలుగుకు గుడి కట్టిన నవ్వుల కలం ఆగిపోయింది. తెలుగు వారి బాల్యాలకు 'బుడుగు'ను కానుకగా ఇచ్చిన నిత్య బాలకుడు ముఖం చాటేశారు. 'కోతి కొమ్మచ్చి' ఆడుతూనే, అందరినీ ఆదమరిపించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సుప్రసిద్ధ రచయిత, సీనియర్ పాత్రికేయుడు, స్నేహ బంధానికి పర్యాయపదం ముళ్లపూడి వెంకట రమణ చెన్నైలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఫ్లూ జ్వరంతో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ప్రాణ మిత్రుడు, ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపూ ఆయన పక్కనే ఉన్నారు. 80 ఏళ్ల ముళ్లపూడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ముళ్లపూడి వర సినీ దర్శకుడిగా పరిశ్రమలో స్థిరపడ్డారు. కుమార్తె అమెరికాలో ఉన్నారు.
ఆమె శుక్రవారం వచ్చే అవకాశముందని, ఆమె రాగానే చెన్నైలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. ముళ్లపూడి మృతి వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, తాతినేని రామారావు, సినీ విమర్శకుడు వీఏకే రంగారావు, గీత రచయిత భువనచంద్ర, రచయిత్రి మాలతీచందూర్, నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం వారిలో ఉన్నారు.
కష్టాల కాపురం
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 1931 జూన్ 28న ముళ్లపూడి వెంకటరమణ జన్మించారు. తొమ్మిదేళ్లకే తండ్రి మరణించారు. ఇల్లు గడవడం కష్టమై.. కుటుంబంతో మద్రాస్ చేరుకున్నారు. తొలుత ఆంధ్ర మహిళాసభలో పని చేయడంతో పాటు పలు కష్టలు పడ్డారు. 5,6 తరగతులను ఏలూరులో, 7,8 తరగతులను రాజమండ్రిలోని వీరేశలింగం స్కూల్లో, ఎస్ఎస్ఎల్సీని మద్రాస్‌లోని పీఎస్ స్కూల్లో పూర్తి చేశారు. అక్కడే బాపూతో పరిచయం ఏర్పడింది.
ఇద్దరూ కలసి 'ఉదయభాను' రాతపత్రికను ప్రారంభించారు. రమణ రాస్తే, బాపూ బొమ్మలు గీసేవారు. 1945లో రమణ తొలి కథ 'అమ్మ మాట వినకపోతే..' 'బాల' మాసపత్రికలో ప్రచురితమైంది. 1954లో ముళ్లపూడి ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరారు. అనంతరం వారపత్రికకు మారి, సినిమా విభాగాన్ని పర్యవేక్షించేవారు. ఇదే సినిమా వైపు మరలడానికి కారణమైంది.
ఆయన కథ అందించిన తొలిచిత్రం 'రక్తసంబంధం'. మూగమనసులు, దాగుడుమూతలు, సాక్షి, బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప, రాధాకళ్యాణం, మంత్రిగారి వియ్యంకుడు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీనాధ కవి సార్వభౌముడు తదితర 39 సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు అందించారు. బాపూ దర్శకత్వంలోనే ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. ఆయన కథ రాస్తే, బాపూ దృశ్య చిత్రీకరణ చేసేవారు. చిత్రకల్పన బ్యానర్ పేరిట సొంత ప్రొడక్షన్ ప్రారంభించి, అందాల రాముడు, సీతాకళ్యాణం తదితర నాలుగు చిత్రాలను ముళ్లపూడి నిర్మించారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "శ్రీరామరాజ్యం'' ముళ్లపూడి చివరి సినిమా.
చిరంజీవి బుడుగు: తానున్నా లేకున్నా తన 'బుడుగు' చిరకాలం వుంటాడని ముళ్లపూడి ఓ ఇంటర్వ్యూలో 'ఆన్లైన్'తో అన్నారు. ఆయన సృష్టించిన బుడుగు పాత్ర తెలుగునాట అంత ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. నిజానికి ముళ్లపూడిని ఆయన తల్లి బుడుగు అని పిలిచేవారు. ఆమెపై ప్రేమతోనే ఆ పాత్రను సృష్టించారు. ముళ్లపూడికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు నంది అవార్డులను అందజేసింది. ప్రతిష్ఠాత్మమైన రఘుపతి వెంకయ్య అవార్డును బాపూతో కలసి పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1995లో రాజలక్ష్మి పురస్కారాలను అందుకున్నారు. ఎస్వీ, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీలు ముళ్లపూడికి గౌరవ డాక్టరేట్ అందజేశాయి.
ప్రముఖుల సంతాపం: ముళ్లపూడి వెంకటరమణ మృతికి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వెలిబుచ్చారు. బాపు-రమణల కలయికలో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలు వచ్చేవని, ముళ్లపూడి మరణంతో ఒక అధ్యాయం ముగిసిందని సీఎం అన్నారు. ముళ్లపూడి హఠాన్మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వెలిబుచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. ఎన్టీఆర్‌తో శ్రీనాథ కవిసార్వభౌమ సినిమాకు పనిచేశారని, బాలకృష్ణతో శ్రీరామరాజ్యం సినిమాకు పనిచేస్తున్నారని గుర్తు చేసుకున్నారు.
ఆయన మృతి తెలుగు చిత్రరంగానికి తీరని లోటన్నారు. ముళ్లపూడి మృతికి మాజీ సీఎం రోశయ్య విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముళ్లపూడి రాసిన 'బుడుగు' రచన, తెలుగువారికి ప్రత్యేకమైందని పీఆర్పీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాపు-ముళ్లపూడి సినిమాల్లో సంభాషణలు, బొమ్మలు తెలుగు జాతి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఇందుకు ముత్యాలముగ్గు ఉదాహరణ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన రచనలతో ఆబాలగోపాలాన్ని అలరించిన రచయితల్లో ముళ్లపూడి ఒకరని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.
ప్రాథమిక విద్యాబోధనను బాగుచేసేందుకు ఆయన ఎంతో తపనతో కృషి చేసినా, పాలకులు వినియోగించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని కృత్రిమత్వాన్ని, మనుషుల మనస్తత్వాల్లోని వికారాల్ని సరిచేసుకునేందుకు వెంకటరమణ సృజనాత్మక రచనలు చేశారన్నారు. ఆయన 'బుడుగు' నేటికీ పెద్ద బాలశిక్షలాగా విదేశాల్లోని తెలుగువారు భద్రపరుచుకుంటున్నారన్నారు. ముళ్లపూడి కుటుంబ సభ్యులకు, బాపుకు తన సంతాపాన్ని తెలిపారు. సృజనాత్మక చిత్రాలకు మాటలు రాయడంలో ముళ్లపూడి దిట్ట అని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులి సాంబశివరావు, పల్లె నర్సింహులు అన్నారు.